AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?

తెలంగాణ వ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల మోత మోగనుంది. వ్యవసాయ భూముల విలువలను ఏకంగా 50 నుంచి 100 శాతం వరకు పెంచేయడంతో రియల్ ఎస్టేట్ సరికొత్త అధ్యాయం మొదలైంది. ఓఆర్ఆర్ పరిధితో పాటు కోకాపేట, రాయదుర్గం వంటి ఏరియాల్లో రేట్లు భారీగా భారీగా పెరిగాయి.

Telangana: భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?
Telangana Land Market Values Increased
Prabhakar M
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 7:28 AM

Share

తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త మార్కెట్ విలువలు జూన్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ఇకపై రాష్ట్రంలోని 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు కొత్త విలువల ఆధారంగానే నిర్వహించనున్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 నుంచి 100 శాతం వరకు పెంచింది. ప్లాట్ల విలువల్లో కూడా భారీ మార్పులు చేసింది. అపార్ట్‌మెంట్లకు మాత్రం 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే పెంపు ఇచ్చింది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ మార్కెట్ విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎకరాకు కనిష్ఠ మార్కెట్ విలువ గతంలో రూ.1.75 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.2.75 లక్షలకు పెరిగింది. గరిష్ఠ మార్కెట్ విలువ మాత్రం హైదరాబాద్ బేగంపేట ప్రాంతంలో ఎకరాకు రూ.35.29 కోట్లుగానే కొనసాగుతోంది. ఓఆర్ఆర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భారీ పెంపులు చోటుచేసుకున్నాయి.

భూముల విలువల పెంపులో కోకాపేట, కొంగరకలాన్, రాయదుర్గం, హఫీజ్‌పేట్, నాగోల్ వంటి ప్రాంతాలు ముందున్నాయి. కోకాపేటలో ఎకరా విలువ రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షలకు పెరిగింది. కొంగరకలాన్‌లో రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు, బుద్వేల్‌లో రూ.5.5 కోట్ల నుంచి రూ.8.25 కోట్లకు చేరింది. హఫీజ్‌పేట్‌లో రూ.11 కోట్ల నుంచి రూ.18 కోట్లకు, రాయదుర్గంలో రూ.9 కోట్ల నుంచి రూ.15 కోట్లకు, నాగోల్‌లో రూ.11 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు లభించింది. జిల్లాల్లో కూడా భూముల మార్కెట్ విలువల్లో మార్పులు చేశారు. నల్గొండలో ఎకరా విలువ రూ.2.25 లక్షల నుంచి రూ.3.93 లక్షలకు పెరిగింది. మిర్యాలగూడలో రూ.4.5 లక్షల నుంచి రూ.6.75 లక్షలకు, కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.25 లక్షల నుంచి రూ.6.03 లక్షలకు చేరింది. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో రూ.78.40 లక్షల నుంచి రూ.90.16 లక్షలకు పెంపు నమోదైంది.

ప్లాట్ల మార్కెట్ విలువల్లో అత్యధిక పెంపు కోకాపేటలో కనిపించింది. అక్కడ చదరపు గజం విలువ రూ.23,800 నుంచి రూ.47,600కు పెరిగింది. అత్తాపూర్‌లో రూ.20,300 నుంచి రూ.30,500కు, కొంపల్లిలో రూ.11,600 నుంచి రూ.17,400కు చేరింది. హనుమకొండలో గజం విలువ రూ.5,800 నుంచి రూ.8,700కు, కాజీపేటలో రూ.9,500 నుంచి రూ.14,250కు పెరిగింది. అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువల్లో మాత్రం పరిమిత పెంపు మాత్రమే జరిగింది. అజంపురా, మాసబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ రూ.2,500 నుంచి రూ.2,700కు పెరిగింది. ఆమనగల్లులో రూ.1,300 నుంచి రూ.1,600కు, మంకాల్, మోకిల, కొంపల్లి ప్రాంతాల్లో రూ.2,200 నుంచి రూ.2,700కు చేరింది. బాలానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో చదరపు అడుగు విలువ రూ.3,000గా నిర్ణయించారు.

కరీంనగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో పాత మార్కెట్ విలువలనే కొనసాగించారు. మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య పెద్దగా వ్యత్యాసం లేని ప్రాంతాల్లో మార్పులు చేయలేదు. అయితే అభివృద్ధి వేగంగా జరుగుతున్న ప్రాంతాలు, ఓఆర్ఆర్ పరిధి, ప్రధాన రహదారులు, వాణిజ్య కేంద్రాల సమీప ప్రాంతాల్లో గణనీయమైన పెంపులు చేపట్టారు. మార్కెట్ విలువలు పెరిగినప్పటికీ రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుమే కొనసాగనుంది. అయితే కొత్త మార్కెట్ విలువల కారణంగా కొనుగోలుదారులు చెల్లించాల్సిన మొత్తం రిజిస్ట్రేషన్ వ్యయం పెరగనుంది.

ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నవారికి కూడా కొత్త విలువలే వర్తిస్తాయి. అదనంగా చెల్లించాల్సిన మొత్తాన్ని భూ భారతి పోర్టల్ ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు. ప్రజల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 82476 19983లను అందుబాటులో ఉంచారు. కొత్త మార్కెట్ విలువల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరగనుండగా, మరోవైపు భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసే వారికి అదనపు భారం తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us