Telangana Intermediate Admission Schedule: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు గాలిపడుతున్నాయి. ఇంత కాలం మూత పడ్డ విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే క్రమంలో 2021-22 సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలచేసింది. జూన్ ఒకటో తేదీ నుంచే ఫస్టియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ప్రకటన విడుదలచేశారు. మొదటి విడుత ఫస్టియర్ ఆన్‌లైన్ ప్రవేశాలు మంగళవారం నుంచే ప్రారంభిం చినట్టు వెల్లడించారు. అయితే కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ జూలై 5వ తేదీతో ముగుస్తుంది. ఇది మొదటి విడుత ప్రవేశాల షెడ్యూల్ మాత్రమే నని, పరిస్థితిని బట్టి రెండో విడుత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల ఇంటర్నెట్ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఇప్పటికే అయా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఎస్‌ఎస్‌సీ ఒరిజినల్ మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాతే ప్రొవిజినల్ అడ్మిషన్లను ఆమోదిస్తామని స్పష్టంచేశారు. ఇతర వివరాల కోసం TSBIE/ acadtsbie. cgg. gov.in / tsbie.cgg.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.
ప్రతి విద్యా సంవత్సం జూన్ మాసంలో మొదలవుతుంది. ఏటా జూన్ మొదటి వారం నుంచే ఇంటర్ కాలేజీలు ప్రారంభవుతుండగా, గతేడాది కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించారు. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా జూన్ 1 నుంచే ఆన్‌లైన్ క్లాసులతోపాటు, మంగళవారం నుంచే ప్రవేశాలు మొదలు కానున్నాయి. సెకండియర్ ఆన్‌లైన్ క్లాసులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితిని బట్టి ప్రారంభిస్తామని జలీల్ వెల్లడించారు. టెన్త్ పాసైన విద్యార్థులు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కో ఆపరేటివ్, తెలంగాణ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఇంటెన్సివ్, మైనార్టీ గురుకులాలు, కేజీబీవీలు, టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపొజిట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇందుకు కీలక మార్గదర్శకాలను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది.
జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు మార్గదర్శకాలు..