TS High Court Guidelines: రాష్ట్రవ్యాప్తంగా కోర్టులు, ట్రైబ్యునళ్లకు తెలంగాణ హైకోర్టు ఇవాళ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణలో పాల్గొంటాయని హైకోర్టు పేర్కొంది.
అయితే, కరోనా వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణకు అనుమతి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు ఉన్న న్యాయవాదులు మాత్రమే విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కాగా, హైకోర్టులో ఆగస్టు 8 వరకు ఆన్ లైన్ లోనే కేసుల విచారణ కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది.
ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆగస్టు 8వరకు ఆన్ లైన్ లోనే కేసుల విచారణ ఉంటుందని పేర్కొన్న హైకోర్టు.. కోర్టులు, ట్రైబ్యునళ్లలో సెప్టెంబరు 9 వరకు పాక్షిక ప్రత్యక్ష విచారణలు కొనసాగుతాయని తెలిపింది. న్యాయవాదులు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు తన మార్గదర్శకాల్లో వెల్లడించింది.