High Court Starts Unlock Process: లాక్‌డౌన్ కారణంగా మూతబడ్డ సంస్థలు ఒక్కొక్కటిగా తిరిగి గాడిలో పడుతున్నాయి. మెల్ల మెల్లగా ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌కే పరిమితమైన కార్యకలాపాలు తిరిగి పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కోర్టులు పూర్తిస్థాయిలో ప్రారంభించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా హైకోర్టుతో పాటు అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 19 నుంచి పాక్షిక విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా ఉద్ధృతి తగ్గడంతో న్యాయస్థానాల్లో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. హైకోర్టుతో పాటు మిగతా ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 16 వరకు ఆన్లైన్ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. ఇప్పటి వరకు కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా రోజు విడిచి రోజు పరిమిత సంఖ్యలో సిబ్బంది మాత్రమే హాజరవుతున్నారు. ఇకపై పూర్తి స్థాయిలో సిబ్బంది హాజరు కావాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.