హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 0.3 శాతం క్రీడా కోటా రిజర్వేషన్లను తొలగించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను తొలగిస్తూ జులై 4న వైద్యారోగ్యశాఖ జీవో 75ను జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జి హరికృష్ణ అనే వ్యక్తితోపాటు ఇతరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. క్రీడా కోటా రిజర్వేషన్‌పై 2018లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది జైశ్వాల్ వాదనలు వినిపించారు. న్యాయవాది జైశ్వాల్ వాదనలు విన్న ధర్మాసనం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.
గ్రూప్ 2 పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు మైనారిటీ సంక్షేమశాఖ, మైనారిటీ స్టడీ సర్కిల్ కీలక ప్రకటన వెలువరించింది. గ్రూప్2కి సంబంధించిన మాదిరి పరీక్షను నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి అధికారి పుష్పలత ఆగస్టు 10న ప్రకటించారు. ఈ మేరకు ఆగస్టు 16, 21, 23 తేదీల్లో హైదరాబాద్ సివిల్ సెంటర్ కోచింగ్ అకాడమీలో పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్ష రాయగోరేవారు పూర్తి వివరాలకు 040-23236112, 0870-2980533 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు కేసీ మహీంద్ర ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ ఆదాయం కలిగిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఆగస్టు 20 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ట్రస్ట్ నిర్వాహకులు ఆగస్టు 10న తెలిపారు. స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులకు ఏడాదికి రూ.10వేల చొప్పున మొత్తం 550 మంది విద్యార్థులకు అందిస్తామన్నారు. ఇలా గరిష్ఠంగా మూడేళ్లపాటు ఇస్తారని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. కేసీ మహీంద్ర ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉపకార వేతనాలకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.