Corona Effect: తెలంగాణపై కరోనా ఎఫెక్ట్.. లాక్‌డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటల రాజేందర్..

|

Apr 10, 2021 | 5:04 PM

Corona Effect: తెలంగాణలో కోరనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది.

Corona Effect: తెలంగాణపై కరోనా ఎఫెక్ట్.. లాక్‌డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటల రాజేందర్..
Etela Rajender
Follow us on

Corona Effect: తెలంగాణలో కోరనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అలర్ట్ అయ్యారు. శనివారం వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉన్నారు. మొదట అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆ తరువాత ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో ఉండకపోవచ్చని అంతా భావించామన్నారు. కానీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోందన్నారు. ఇక దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో 40శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయని మంత్రి ఈటల రాజేందర్ ఉటంకించారు. కాగా, మహారాష్ట్రతో తెలంగాణకు రాకపోకలు రెగ్యూలర్‌గా ఉంటాయని, మహారాష్ట్ర ఎఫెక్ట్ తెలంగాణపై ఉండే అవకాశం ఉందన్నారు. దాదాపు రోజుకు లక్ష మంది మహారాష్ట్ర-తెలంగాణ మధ్య ప్రయాణాలు సాగిస్తుంటారని మంత్రి పేర్కొన్నారు. కరోనాతో సహజీవనం చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూలు పెట్టే పరిస్థితి లేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా నివారణకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆక్సిజన్, ఇంజెక్షన్, మ్యాన్ పవర్ సిద్ధంగా ఉంచాలని అధికారులకు మంత్రి ఈటల రాజేందర్ దిశానిర్దేశం చేశారు. ఒకరికి ఒకరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని, తప్పించుకునే పరిస్థితి ఉండొద్దన్నారు.

అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి ఈటల రాజేందర్.. ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలతో కోటి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్‌కు వైద్యం కోసం వస్తున్నారని, వారికి చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రైవేటు ఆస్పత్రుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసిందన్నారు. ఏడాది కాలంలో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నామని అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు అనగానే దోచుకుంటాయి అనే పరిస్థితి ఉండొద్దని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు మంత్రి ఈటల సూచించారు. పేదోడికి బెడ్లు దొరికే పరిస్థితి ఉండక పోవచ్చునన్న ఆయన.. పేదలు ప్రైవేటు ఆస్పత్రికి వచ్చినపుడు వాళ్ళను ఆర్ధికంగా ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ప్రైవేటు ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహారించాలన్నారు. కరోనా అంటే ఏడాది కింద ఉన్న భయం ఇపుడు లేదన్నారు. కొవిడ్ ట్రీట్మెంట్‌తో పాటు.. నాన్ కోవిడ్ రోగులకూ వైద్యం అందించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు మంత్రి ఈటల రాజేందర్ దిశానిర్దేశం చేశారు. ప్రజల దృష్టిలో కార్పొరేట్ ఆస్పత్రులపై సరైన భావన లేదని, ప్రజల్లో ఉన్న ఆ భావనను తొలగించాలన్నారు.

Also read:

విజయవాడలో దారుణం, తండ్రి(38) కూతురు(10) ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య.. ‘ఐ నీడ్‌…’ అంటూ గోడపై రాతలు

Maoist Tension: తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ మావోయిస్టు టెన్షన్.. తెలంగాణలో పోలీసులు అలర్ట్.. ఏజెన్సీలోను అంతే