Telangana: పట్టభద్రుల ఓట్ల వేట.. ప్రచారంతో కాంగ్రెస్ దూకుడు.. అభ్యర్థులపై బీఆర్ఎస్, బీజేపీ మంతనాలు..
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారభేరి మోగించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీ కసరత్తు చేస్తున్నాయి. రెండు కీలక స్థానాలపై కన్నేసిన ప్రధాన పార్టీల ఎత్తులు-పైఎత్తులతో పొలిటికల్ హీట్ పెరిగింది.

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీనిలోభాగంగా మిత్రపక్షాల మద్దతును కూడగడుతోంది. ఇప్పటికే TJS సపోర్ట్ తీసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు సీపీఐతో చర్చలు జరిపింది. సీపీఐ సానుకూలంగా స్పందించిందని టీపీసీసీ చీఫ్ చెప్పారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతోంది అధికార పార్టీ. బీఆర్ఎస్, బీజేపీ ఇంతవరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించకపోవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక బీఆర్‌ఎస్ కూడా వేడి పెంచింది. హైదరాబాద్ వేదికగా మొన్న కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తే.. లేటెస్టుగా బీఆర్ఎస్ కీలక నేతల భేటీ జరిగింది. తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. మరోవైపు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించింది. టీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ బన్సల్..పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో పార్టీ వెనుకబడిందన్నారు బన్సల్. ఎన్‌రోల్‌మెంట్‌పై లీడర్లు, కేడర్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఇక ఒక్కో స్థానానికి ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేయనున్నారు.
