తెలంగాణ ప్రజలపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీశ్ రావు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న గృహ లక్ష్మీ పథకానికి సంబంధించి మంత్రి కీలక ప్రకటన జారీ చేశారు. ఈ పథకం ద్వారా సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇళ్లు కట్టిస్తామని మంత్రి తెలిపారు. గృహ లక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై మంత్రి ఇంకా మాట్లాడుతూ.. రెండో విడత కింద లక్షా 30 వేల కుటుంబాలకు దళితబంధు అందిస్తామని ప్రకటించారు. ఏటా ఆగస్టు 16న దళితబంధు వేడుకలు నిర్వహిస్తామని, ఒక్కో నియోజకవర్గంలో11 వందల మంది చొప్పు, మొత్తం లక్షా 30 వేల మందికి దళితబంధు అందిస్తామని హరీష్ అన్నారు. ఇక గృహ లక్ష్మీ కింద ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇళ్లు నిర్మిస్తామన్న మంత్రి.. వేంటనే లబ్దిదారుల ఎంపిక ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగానే ఒక్కో ఇంటికి ప్రభుత్వం 3 లక్షలు గ్రాంట్‌గా ఇస్తామన్న మంత్రి, 3 విడతల్లో లక్ష చొప్పున అందిస్తామన్నారు.
ఈ పథకం కోసం రూ. 12 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఇళ్లాలు పేరు మీదనే ఇళ్లు మంజూరు అవుతాయని, గతంలో పేదల ఇళ్లపై ఉన్న అప్పులను రద్దు చేస్తున్నామన్నారు. ఇక గొర్రెల పంపిణీ కోసం రూ.4, 463 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపిన హరీష్ రావు.. రెండో విడత గొర్రెల పంపిణీ ఏప్రిల్‌లో ప్రారంభిస్తామన్నారు. 4 లక్షల ఎకరాల్లో పోడుభూముల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..