Dharani Portal: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భూముల వివారాలను నమోదు చేసేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రవేశపెట్టింది. మొదట్లో పోర్టల్ లో ఏర్పడిన సమస్యల కారణంగా తొందరగా అందుబాటులోకి రాలేదు. తర్వాత సమస్యను పరిష్కరించి అందుబాటులోకి తీసుకువచ్చింది సర్కార్. ధరణి పోర్టల్ కు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు అయినా ఇక నుంచి సులువుగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దాని కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్, మెయిల్ ఐడీని తీసుకొచ్చారు.
భూముల వివరాలు, రిజిస్ట్రేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న ఆవిష్కరణే ధరణి పోర్టల్. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి, త్వరితగతిన పరిష్కారాలు చూపడానికి, భూముల వివరాలు పొందడానికి ధరణి పోర్టల్ ని ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా భూముల వివరాలన్నీ ధరణి పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి. భూమికి సంబంధించి రిజిస్ట్రేన్ల స్లాట్ల దగ్గర నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు ఇందులో ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్లను పొందుపరుస్తూ ధరణి పోర్టల్ కొనసాగుతోంది.
ఈ పోర్టల్ అందుబాటులోకి రావడంతో భూముల క్రయవిక్రయాల్లో చాలా తొందరగా ప్రాసెస్ అయిపోతోంది.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పాస్‌బుక్ కూడా చేతిలో పెట్టేస్తున్నారు అధికారులు. అయితే, ధరణిలో కొన్ని సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.. ఇక, వాటి పరిష్కారానికి రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి.. దీంతో.. ఆ సమస్యలు అన్నింటిని త్వరితగతిన పరిష్కరించడానికి సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం.. ధరణి కి సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు తాజాగా.. వాట్సాప్, ఈ మెయిల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
రైతులకు ఏవిధమైనా సమస్యలుంటే ascmro@telangana.gov.in మెయిల్ ద్వారా లేదంటే 9133089444 నంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు.. ఇక, సమస్యలు పెండింగ్‌లో పెట్టకుండా.. వెంటనే పరిష్కరించేందుకు వీలుగా.. ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీలో సీసీఎల్‌ఏ, రిజిస్ట్రేషన్లు, ఐటీ విభాగ అధికారులు సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. ధరణి సమస్యలపై సమీక్షించిన సీఎస్.. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.