
హైదరాబాద్, జనవరి 21: తెలంగాణలో సంక్రాంతి సెలవులు ముగిశాయి. అన్ని చోట్ల స్కూల్స్, కాలేజీలు మొదలయ్యాయి. ఇక పరీక్షలు త్వరలోనే రానుండటంతో విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే ఈ నెల చివరిలో తెలంగాణలో మరో 4 రోజులు విద్యార్థులకు సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం మేడారం జాతర. తెలంగాణ ప్రజలకు మేడారం జాతర ఎంత ప్రత్యేకమో చెప్పనవసరం లేదు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జనవరి నెలాఖరులో జరగనుంది.
ఈ జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనుంది. సమ్మక్క–సారలమ్మ దేవతలను రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ప్రజలు దర్శించుకుంటారు. ఈ జాతర సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని పీర్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి జాతరకు వెళ్లే అవకాశం ఉన్నందున సెలవులు ఇవ్వడం సమంజసమని కోరుతున్నారు. ఇదే జరిగితే విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే సాధారణంగా మేడారం జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతుంది. దీంతో ఈ జిల్లా పరిధిలోని విద్యా సంస్థలకు స్థానిక సెలవులు అధికారులు ప్రకటిస్తుంటారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు ఈ జాతరకు కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో రవాణా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. యేటా ఈ జాతరకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. జాతర సమయంలో బస్సులు, రైళ్లు, రహదారులు భక్తులతో కిక్కిరిసిపోతాయి. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.