TS Inter Exams: ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి.. కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శికి గురువారం నాడు లేఖ రాశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జులై మధ్యలో నిర్వహించే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. అదే విధంగా పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి గంటన్నరకు తగ్గించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రశ్నపత్రాలు ఇప్పటికే సిద్ధమైనందున పరీక్ష విధానం మార్చలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ప్రశ్నపత్రంలోని సగం ప్రశ్నలే రాసేందుకు అవకాశం ఇస్తామన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇక కరోనా కారణంగా పరీక్షలు రాయలేకపోయిన వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సదరు లేఖలో స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలతో పాటు.. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలను తెలంగాణ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ద్వితీయ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలను త్వరలో నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన వెంటనే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also read: