
తెలంగాణ రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తీపికబురు అందించింది. జనవరి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ పథకం అమలు చేయడానికి 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఏకంగా రూ.101.83 కోట్లను తాజాాగా రేవంత్ సర్కార్ విడుదల చేసింది. ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిసి అమలు చేయనుంది. కేంద్రం వాటాగా 60 శాతం ఇవ్వనుండగా.. 40 శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా రైతులకు సబ్సిడీకి వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు. వ్యవసాయ పనిముట్లపై 50 శాతం రాయితీ పొందవచ్చు.
ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు గరిష్టంగా వ్యవసాయ పనిముట్లపై 50 శాతం రాయితీ పొందే అవకాశముండగా.. ఇతర వర్గాలవారు 40 శాతం తగ్గింపు పొందవచ్చు. ఇప్పటికే ఈ పథకం కింద లబ్ది పొందేందుకు 5.50 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. 1.30 లక్షల మంది రైతులను తొలుత ఎంపిక చేశారు. వీరికి త్వరలో రాయితీ సౌకర్యం కల్పించనున్నారు. వ్యవసాయానికి అవసరమయ్యే వివిధ రకాల పనిముట్లపై ఈ రాయితీ దక్కనుంది. ప్రభుత్వం నిధులు కూడా జమ చేయడంతో తక్కువ ధరకే పనిముట్లు లభించడం వల్ల రైతులకు భారం తగ్గనుంది.
గతంలో ప్రభుత్వమే యంత్రాలను కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై అందించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. ఐదు ఎకరాల్లోపు పోలం ఉన్న చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. 15 రకాల పనిముట్లు సబ్సిడీ జాబితాలో పొందుపర్చారు. వీటిపై రైతులకు సబ్సిడీ దక్కనుంది. ప్రస్తుతం 16 కంపెనీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తే రైతు వాటా మినహాయించి మిగతాది ప్రభుత్వం కంపెనీల అకౌంట్లోమ జమ చేస్తుంది. రూ.లక్షకు మించి కొనుగోలు చేసిన పరికరాలకు ప్రభుత్వం జియో ట్యాగింగ్ ఇవ్వనుంది. అలాగే చిన్న పరికరాలకు ఏఐ ఆధారిత టెలిమాటిక్స్ కిట్‌లను అమర్చుతారు. యంత్రాలు దుర్వినియోగం కాకుండా చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోనున్నారు.