Indiramma Houses: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే ప్రారంభం. రేవంత్ చేతుల మీదుగా..

ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. రెండో విడత ఇళ్ల మంజూరుపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు మంజూరుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. తొలి విడతలో కేటాయించిన ఇళ్లల్లో లక్ష ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోగా.. జూన్ 1న గృహప్రవేశాలు చేయనున్నారు.

Indiramma Houses: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే ప్రారంభం. రేవంత్ చేతుల మీదుగా..
Indiramma Scheme

Updated on: May 29, 2026 | 10:02 AM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి రెండో విడత ఇళ్లను ప్రారంభించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజున ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలం కొఠారి గ్రామంలో రెండో విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. సెకండ్ ఫేజ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన చాలామంది పేదలు రెండో విడత ఇళ్ల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం మంజూరు చేయనుండటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.

జూన్ 1న ముహూర్తం ఫిక్స్

తొలి విడతలో మొత్తం 4.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిల్లో ఇప్పటికే లక్ష ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోగా.. వీరికి రూ.6,500 కోట్లు చెల్లించారు. తొలి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేశారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల చొప్పున 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడతలో పూర్తయిన లక్ష ఇళ్లకు జూన్ 1,2వ తేదీల్లో గృహప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక తొలి విడతలో మంజూరు చేసిన వాటిల్లో మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా తుది దశకు చేరుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. జూన్ 1వ తేదీన కొఠారి గ్రామంలో 28 మంది కొలాం ఆదివాసీలు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న ఇళ్లకు రేవంత్ గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు పాల్గొననున్నారు.

ప్రతీ ఒక్కరికీ రూ.5 లక్షలు

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్దిక సాయం అందిస్తోంది. విడతల వారీగా వీటిని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయ్యే కొద్ది దశలవారీగా వీటిని అందిస్తోంది. అయితే 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అనంతరమే నిజమైన లబ్దిదారులకు ఇళ్లను కేటాయిస్తున్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇళ్లను మంజూరు చేస్తున్నారు. ఇక జీపీఎస్, ఏఐ టెక్నాలజీతో ఉపయోగించుకుంటూ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రవేశపెట్టారు. ఫిర్యాదులపై 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Follow Us