Telangana: మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే యాప్.. ఒక్క క్లిక్‌తో ఫోన్ నుంచే అన్నీ సేవలు

Mana Stree Nidhi APP: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. మహిళా సంఘాల కోసం తాజాగా కొత్త యాప్ లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా మహిళలు రుణాలు పొందవచ్చు. అంతేకాకుండా లోన్ స్టేటస్, ఇతర వివరాలు అన్నీ చెక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

Telangana: మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే యాప్.. ఒక్క క్లిక్‌తో ఫోన్ నుంచే అన్నీ సేవలు
Telangana Womens

Updated on: Dec 28, 2025 | 7:35 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత వేగంగా, సులభతరంగా సేవలు అందించేందుకు టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకుంటోంది. ప్రజలు తమ మొబైల్ నుంచే అన్నీ సేవలు పొందేలా డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవల మీ సేవకు వెళ్లాల్సిన అసవరం లేకుండా మీ సేవ యాప్‌ను తీసుకురాగా.. దీని ద్వారానే ప్రజలు ఇన్ కమ్, కులం, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లాంటివి పొందవచ్చు. ఇక రేషన్ కార్డు వివరాలు, డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందనేది తెలుసుకునేందుకు ఇటీవల టీ రేషన్ యాప్ ప్రారంభించింది. అలాగే రైతుల కోసం కొద్దిరోజుల క్రితం యూరియా బుక్ చేసుకునేందుకు యాప్ లాంచ్ చేయగా.. తాజాగా మహిళలకు ఉపయోగపడేలా కొత్త యాప్ తెచ్చింది.

స్త్రీ నిధి పేరుతో యాప్

మహిళా పొదుపు సంఘాలకు ఆర్ధికంగా తొడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్త్రీ నిధి పేరుతో రుణాలు మంజూరు చేస్తోన్న విషయం తెలిసిదే. ఈ రుణాలను సులువుగా పొందేలా మన స్త్రీనిధి పేరుతో యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే మహిళలు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అసవరం లేదు. ఇప్పటికే రుణం తీసుకున్నవారే కాకుండా కొత్తగా లోన్ తీసుకోవాలనుకునేవారు ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మహిళలు తాము నెలనెలా చెల్లించే వాయిదాల సొమ్మును ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కొంతమంది తమ సభ్యులకు తెలియకుండా నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు ప్రతీ మహిళ తాము చెల్లించిన డబ్బులు అకౌంట్లో పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు.  ఒకవేళ డబ్బులు జమ కాకపోతే అధికారులను వెంటనే సంప్రదించవచ్చు. అలాగే గతంలో చెల్లించిన సొమ్మును బట్టి ఎంత రుణం వస్తుంది.. ?రుణం పొందిన తర్వాత స్టేటస్ ఏంటి..? ఎవరి దగ్గర పెండింగ్ ఉంది..? అనే అన్నీ వివరాలను స్త్రీ నిధి యాప్ ద్వారా తెలుసుకునే అవకాశముంది.

డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలంటే..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మన స్త్రీనిధి అని సెర్చ్ చేయండి

-మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి

-ఫోన్ నెంబర్ టైప్ చేసి రిజిస్టర్ అవ్వండి

-మీ సంఘం వివరాలు, లోన్ల వివరాలు చెక్ చేసుకోండి