Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎగిరి గంతేసే వార్త.. నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక అప్డేట్..
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోని ప్రజలకు ఇళ్లను మంజూరు చేస్తోంది. ఇప్పటికే లక్షలాది ఇళ్లు మంజూరు చేయగా.. వాటిల్లో కొన్ని గృహప్రవేశాలు కూాడా పూర్తి చేసుకున్నాయి.

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. సంక్రాంతి కానుకగా లబ్దిదారులకు ఉపయోగపడేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి లబ్దిదారుల అకౌంట్లో మరింత వేగవంతంగా నిధులు జమ కానున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా మరింత వేగవంతంగా అందేలా కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఎంత వేగంగా ఇల్లు పూర్తవుతుంటే అంత వేగంగా లబ్దిదారుల అకౌంట్లో డబ్బులు పడేలా చేయనుంది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు.
త్వరగా నిధులు మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిధులు లబ్దిదారులకు మరింత వేగంగా అందనున్నాయి. తాజాగా రామగుండంలో డిప్యూటీ సీఎం డిప్యూటీ భట్టి విక్రమార్క పర్యటించారు. పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేయగా.. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎంత వేగంగా పూర్తయ్యే కొద్ది అంతే వేగంతో లబ్దిదారుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతీవారం లబ్దిదారుల అకౌంట్లోకి డబ్బులు విడుదల చేసేలా అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. బిల్లులు విడుదల చేయడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయగా.. ఇప్పటివరకు ప్రభుత్వం 22 వేల 500 కోట్లు విడుదల చేసింది. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామాల్లోని కాకుండా పట్టణాల్లోని ప్రజలకు కూడా ఇళ్లను కేటాయించేందుకు రెడీ అవుతోంది.
రామగుండంలో పవర్ ప్లాంట్
రామగుండంలో త్వరలో 800 మెగావాట్ల థర్మర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు. అటు పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయనున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉండదని, అందుకోసం అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా ఇప్పటికే ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు. కేవలం బొగ్గుకు మాత్రమే కాకుండా సింగరేణిని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్దిలో సింగరేణి పాత్ర కీలకంగా ఉందని పేర్కొన్నారు.
