Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? న్యూ ఇయర్ వేళ ప్రభుత్వం నుంచి తీపికబురు

ఇందిరమ్మ ఇళ్ల పధకంపై తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ 1 కేటగిరీలో ఉన్న దరఖాస్తుదారుల విషయంపై గుడ్ న్యూస్ తెలిపింది. ఈ కేటగిరీలో ఉన్నవారికి ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యత ఇస్తుండగా.. అది కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? న్యూ ఇయర్ వేళ ప్రభుత్వం నుంచి తీపికబురు
Indiramma Houses

Updated on: Dec 29, 2025 | 7:56 PM

Telangana Government: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రస్తుతం గ్రామాల్లోని నిరు పేదలకు వీటిని మంజూరు చేస్తోంది. ఇల్లు మంజూరైన వారికి నిర్మాణం కొద్ది విడతల వారీగా నిధులు వారి అకౌంట్లలో నేరుగా జమ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఇళ్లను నిర్మించుకోగా.. కొన్నిచోట్ల గృహాప్రవేశాలు కూడా పూర్తయ్యాయి. ఇళ్లు మంజూరు చేసేందుకు దరఖాస్తుదారుడి ఆర్ధిక స్థితిగతులను బట్టి కేటగిరీలుగా విభజించింది. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేటగిరీలుగా విభజించి ఇళ్లను మంజూరు చేస్తోంది. ఎల్ 1 కేటగిరీలో ఉన్నవారికి తొలుత వీటిని మంజూరు చేస్తుండగా.. తాజాగా మరో కీలక అప్డేట్ ప్రభుత్వ నుంచి వచ్చింది.

సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలను ఎల్ 1 కేటగిరీలో ఉంచారు. వీరికి మాత్రమే ఇప్పటివరకు మంజూరు చేశారు. దరఖాస్తుదారుల ఇంటింటి సర్వే తర్వాత ఎల్ 1 జాబితాలో 23,20,490 మంది ఉన్నట్లు తేలింది. వీరిలో ఇప్పటివరకు కొంతమందికి మాత్రమే మంజూరు అవ్వగా.. రాబోయే రెండేళ్లు కూడా ఈ కేటగిరీలో ఉన్నవారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఎల్ 2 కేటగిరీలో ఉన్నవారికి ఇల్లు మంజూరు కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది.

ఎల్ 2లో స్థలం, ఇల్లు రెండూ లేనివారు ఉన్నారు. ఈ కేటగిరీ కింద 21,49,476 దరఖాస్తులను అధికారులు గుర్తించారు. అయితే వీరికి స్థలం, ఇల్లు ఎలా నిర్మించి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. స్థలం ఇచ్చిన ఇల్లు నిర్మాణానికి నిధులు ఇవ్వాలా లేదా అపార్ట్‌మెంట్స్ తరహాలోనే బ్లాక్‌లు ఇవ్వాలా అనే దానిపై మార్గదర్శకాలు సిద్దం చేయాల్సి ఉంది. ఇక ఎల్ 3 కేటగిరీలో ప్రభుత్వం ఉద్యోగులు, ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉన్నారు. వీరి దరఖాస్తులను రద్దు చేసే అవకాశముంది.  కాగా ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,69,014 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఇప్పటివరకు 2.45 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.