విభజన సమస్యలపై కేంద్రానిది నాన్చుడు ధోరణే అని ఆరోపించింది తెలంగాణ సర్కార్. అందుకే కేంద్ర హోంశాఖ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో సమస్యల పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించింది. షెడ్యూల్ 9,10 సంస్థల విభజన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ.
షెడ్యూల్ 9 సంస్థల విభజనపై షీలాబిడే కమిటీ 90 సంస్థలకు సిఫార్సులు చేసింది. 45 సంస్థల విభజనకు తెలంగాణ, ఏపీలు అంగీకరించాయి.15 సంస్థలపై తాము అంగీకరించినా.. ఏపీ అంగీకరించలేదంటోంది తెలంగాణ. అలాగే హైదరాబాద్‌కు వచ్చే ఆదాయంలో వాటా కోసం విభజన చట్టాన్ని సవరించాలన్న ఏపీ ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇక తెలంగాణకు రావాల్సిన 354 కోట్ల రూపాయల సబ్సిడీని కేంద్రం ఏపీకి పంపిందని.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది.
సింగరేణి సంస్థను విభజించాలన్న ఏపీ వాదన సరికాదంది తెలంగాణ. గిరిజన వర్శిటీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై సానుకూలంగా స్పందించింది కేంద్రం. అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది తెలంగాణ. ఇక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజుబులిటీ కాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గులాబీ దళం భగ్గుమంది. తెలంగాణ ప్రజలకు కిషన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీఆర్‌ఎస్ నేతలు. మరోసారి తెలంగాణ ప్రజలను, గిరిజన యువతను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీ అలాగే కంటిన్యూ అవుతోంది. విభజన వివాదాలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..