Telangana: పెట్రోల్ కోసం బంక్‌కి వెళుతున్నారా..? ఇది తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్..!

హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డ్ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజల్ కొరత ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

Telangana: పెట్రోల్ కోసం బంక్‌కి వెళుతున్నారా..? ఇది తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్..!
Petrol Pump Rush

Edited By:

Updated on: Mar 25, 2026 | 5:21 PM

తెలంగాణలో పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు క్యూ కట్టడం, పెట్రోల్ బంక్‌లు మూతపడినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఇంధన కొరత లేదని, ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రెండు నెలలకు సరిపడ పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందని స్పష్టం చేశారు. ప్రజలు బంక్‌ల వద్ద క్యూలు కట్టవద్దని, డ్రమ్ములు, కంటైనర్లలో నింపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు.

వాణిజ్య గ్యాస్‌కు కొరత

తెలంగాణలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు కొరత ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టతిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, హైదరాబాద్‌లో వదంతుల వల్లే పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే పరిస్థితి నెలకొందన్నారు. డబ్బాల్లో పెట్రోల్ పోయవద్దని బంక్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు, వాటిపై నిషేధం విధించినట్లు ఉత్తమ్ తెలిపారు. గ్యాస్, పెట్రోల్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని హితవు పలికారు.

సీపీ సజ్జనార్ హెచ్చరికలు

నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో బుధవారం టీజీసీసీసీలో జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన, ఐఏఎస్, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ శ్వేత, ఐపీఎస్, సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా.. 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us