జులై 22(శనివారం) రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది విద్యా శాఖ. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సెలవు ఇస్తున్నట్లు వెల్లడించింది. జీహెచ్ ఎంసీ పరిధిలో ఇప్పటికే శనివారం కూడా సెలవు ఇస్తున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా మరికొన్ని చోట్ల నదులు చెరువులు పొంగిపొర్లుతుండడం, రోడ్లు తెగిపోవడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని సెలవు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాల కారణంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తల్లిదండ్రులు హాలిడే ప్రభుత్వం ప్రకటిస్తే క్లాసులు ఎలా నిర్వహిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లలను బయటకు రాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం పిల్లల భద్రత దృష్ట్యా సెలవు ఇచ్చినందున పిల్లలను ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
వాయవ్య బంగాళాఖాతంతోపాటు ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇప్పటికే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. కుంటాల, పొచ్చెర జలపాతాలకు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టుకు వరద భారీగా చేరుకోవడంతో నిండకుండను తలపించింది. దాంతో.. 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. అయితే.. గతంలో మాదిరిగానే నాలుగు గేట్లు తెరుచుకోకుండా అధికారులకు షాకిచ్చాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది.
భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో భద్రాచలం వెళ్లి పరిస్థితులు సమీక్షించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
నిర్మల్ జిల్లా గుండెగాం గ్రామాన్ని వరద నీరు చుట్టేసింది. బైంసా గడ్డేన్న వాగుకు గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద వరద నీరు మినీ జలపాతాన్ని తలపించింది. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జాలు వారుతున్న జలపాతాలు, అడవిని ముద్దాడుతున్న మేఘాలతో వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవి ఆహ్లాదకరంగా మారింది. ఇక.. హైదరాబాద్‌లోనూ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం స్తంభించింది. ఎడతెరపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గాజులరామారం వొక్షిత్ ఎన్‌క్లేవ్ కాలనీకి ఎగువన ఉన్న పెద్ద చెరువు నిండడంతో సమీపంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..