తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటుంది. పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతున్న ఘటనలు చూస్తున్నాం. యూత్ గంజాయికి బాగా అడిక్ట్ అయినట్లు చాలా రిపోర్టులు చెబతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్ తరం మత్తులో జోగిపోయే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కొత్తగూడెంలో పార్కులో ఓ మూలన పెరుగుతున్న గంజాయి మొక్కను గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వార్త విన్న వెంటనే కొత్తగూడెం పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక్కడ ఇంకో వింత ఏంటంటే.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలోనే ఈ పార్క్ ఉంది. ప్రకాశం స్టేడియం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న తోటలో ఈ గంజాయి మొక్కను గుర్తించారు. మునిసిపాలిటీ తోట సమీపంలో ఈ మొక్కను ఎవరు పెంచారో, ఎలా పెంచారో అర్థం కావడం లేదు.
స్థానికులు సమాచారంతో ఘని అనే హెడ్ కానిస్టేబుల్ ఘటనా స్థలానికి చేరుకుని, మొక్కను పీకి, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. రోజూ పిల్లలు ఆడుకునే, అందరూ వాకింగ్ చేసే పార్క్ సమీపంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. గంజాయి మొక్క ఒక ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. అది ఉన్న చోటు నుంచి చాలా ప్రాంతం వరకు ఆ స్మెల్ వస్తుంది. అయినప్పటికీ.. ఆ మొక్క పెరిగి పెద్దది అయ్యేవరకు ఎవరు గుర్తించకపోవడం గమనార్హం.