Madhusudhana Chary: తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్‌భవన్‌కు ఫైలును పంపించగా… గవర్నర్ తమిళిసై ఇందుకు ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై సస్పెన్స్ తొలగినట్లయింది. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించినసంగతి తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదనకు గవర్నర్ తిరస్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అభ్యర్థిని ఆమోదం కోసం పంచించడం జరిగింది. ఇటీవల కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కడంతో ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారికి అవకాశం ఇచ్చారు.
మధుసూదానాచారి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన స్పీకర్‌గా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి మధుసూదనాచారికి ఏ పదవి దక్కలేదు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఎమ్మెల్సీగా కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు.
ఇదిలావుంటే, స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న మధుసూదనాచారిని శాసనమండలి ఛైర్మన్‌గా నియమించే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసే సమయానికి మండలి ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. మరోసారి ఆ పదవిలో కొనసాగేందుకు విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చారనే ప్రచారం నేపథ్యంలో మండలి సారథ్యం మధుసూదనాచారికే దక్కవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి పేరు కూడా మండలి ఛైర్మన్ రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక, ఇటీవలే రాజ్యసభకు రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకున్న బండా ప్రకాశ్‌ను మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.