Telangana Formation Day: అభివృద్ధిలో శిఖరాగ్రాన తెలంగాణ.. ఏ రాష్ట్రం సాధించని విజయాలు మన సొంతం.. సీఎం కేసీఆర్ ప్రసంగం..

Telangana Formation Day: ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Telangana Formation Day: అభివృద్ధిలో శిఖరాగ్రాన తెలంగాణ.. ఏ రాష్ట్రం సాధించని విజయాలు మన సొంతం.. సీఎం కేసీఆర్ ప్రసంగం..
Cm Kcr Speech
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 02, 2022 | 1:25 PM

Telangana Formation Day: ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించి చూపిందన్నారు. అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం యధావిధిగా..

దేశానికే ఆదర్శం తెలంగాణ.. ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, సాధించిన విజయాలు ఎన్నో కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ప్రతీ విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్తు సరఫరాలో, తాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటి రంగాల ప్రగతిలో ఇలా అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం.

అభివృద్ధిలో శిఖరాగ్రాన తెలంగాణ.. అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. ప్రజలందరి దీవెన, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లే ఇదంతా సాధ్యపడింది. కఠినమైన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం. 17.24 శాతం సగటు వార్షిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా, కరోనావంటి విపత్తులు తలెత్తుతున్నా తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోంది.

ఆ నివేదికలే కొలమానం.. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతి త్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణా దక్షతకు దక్కిన గుర్తింపు. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జిఎస్‌డిపి 5,5,849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది. తలసరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104 కాగా, 2021-22 నాటికి 2,78,833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన 1,49,848 రూపాయలకంటే ఇది 86 శాతం అధికం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రోజురోజుకూ పెరుగుతుండటం శుభ పరిణామం.

కరెంట్ సమస్యలకు చెక్.. కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. రాష్ట్రంలో నేడు అన్ని రంగాలకూ నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ కోతలతో, పవర్ హాలిడేలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాం. రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్ విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గత ఎనిమిదేళ్ళలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది. ఇక జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73 శాతం అధికంగా ఉంది.

నీటి సమస్యలకు చరమగీతం.. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అంతర్భాగంగా ఉన్నపుడు గ్రామాల్లో ప్రజలు సాగునీటి కోసమే కాదు, తాగునీటి కోసం కూడా తల్లడిల్లారు. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించేది. ఈ సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించాం. నేడు రాష్ట్రంలోని 100 శాతం ఆవాసాలలో ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా జరుగుతోంది. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తిచేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ పథకాన్ని ఎందరో ప్రశంసించారు. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా లభించింది. తెలంగాణ అమలుపరచిన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అనేక రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఈ పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించి వెళ్ళడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా మంచినీరు దొరకని ప్రాంతం లేదు. నీటికోసం బిందెలతో మహిళలు బారులుతీరిన దృశ్యాలు లేవు. మంచినీటి యుద్ధాలు లేవు. ప్రజల దాహార్తి తీర్చాలన్న ప్రభుత్వ అంకిత భావానికి ఇది ప్రబల నిదర్శనం.

వ్యవసాయం నేడు పండుగ.. సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత, వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కునారిల్లిపోయింది. సాగునీరు లేదు. బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు. పెట్టుబడి లేదు. అప్పులతో, కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి. ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించిన నాకు ఆనాడు రైతాంగం దుస్థితిని చూసి మనసు వికలమైంది. కృష్ణా, గోదావరి నదులు మన ప్రాంతంగుండా ప్రవహిస్తున్నా  సాగునీటికి నోచని రైతుల దుస్థితి చూసి చలించిపోయాను. అందుకే, స్వరాష్ట్ర సాధన అనంతరం వ్యవసాయరంగంపైనా, రైతుల సంక్షేమంపైన ప్రత్యేక దృష్టిని సారించాను. రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, పథకాలూ అమలులోకి తేవటంతో నేడు మన రాష్ట్రం ‘సజల సుజల సస్యశ్యామల తెలంగాణ’ గా మారింది.

రైతన్నల కోసం ఈ పథకాలు.. రైతన్నల రుణభారం తగ్గించడానికి రైతురుణ మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవటం, ప్రతీ ఐదువేల ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్ గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించటం, రైతువేదికల నిర్మాణం, పంటకల్లాల నిర్మాణం, రైతుబంధు సమితిల ఏర్పాటు, పంటకాలంలో పెట్టుబడి సాయం కోసం రైతుబంధు, విధివశాత్తూ  అసువులు బాసిన రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు రైతుబీమా, ప్రాజెక్టులు నిర్మించి సమృద్ధిగా సాగునీరు అందించడం, నీటి తీరువా బకాయిల రద్దు చేయటం, ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా సాగునీటి సరఫరా చేయటంద్వారా నేడు వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించగలిగాం. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో మరే రాష్ట్రంలోనూ రైతన్నలకు ఇంతటి సౌకర్యాలు లేనే లేవు. నేడు ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయి.

మిషన్ కాకతీయతో అనేక ప్రయోజనాలు.. తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయరంగానికి శతాబ్దాలుగా ఆదరువుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురై, పూడిపోయి, గట్లు తెగిపోయి, శిథిలావస్థకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం మిషన్ కాకతీయ పేరుతో పెద్దఎత్తున ఈ చెరువులను పునరుద్ధరించుకున్నాం. 15 లక్షలకుపైగా ఎకరాల సాగుభూమిని స్థిరీకరించుకున్నాం. చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. ఈ చెరువులన్నింటికీ సాగునీటి ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసిన ఫలితంగా నేడు వేసవిలో కూడా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలమట్టం పెరిగింది. చెరువులు అభివృద్ధి చెందటంతో చేపల పెంపకం జోరందుకుని, మత్స్యకారులు పెద్ద ఎత్తున లబ్ది పొందుతున్నారు.

భారీ నీటి ప్రాజెక్టులు.. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్  మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన  పూర్తి చేశాం. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి, చనాకా-కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వఘట్టం. కేవలం మూడేళ్ళలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచాం. చైనా వంటి దేశాల్లో మాత్రమే సాధ్యమనుకునే వేగంతో ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తోంది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన రిజర్వాయర్ మల్లన్న సాగర్. దీని నిల్వ సామర్థ్యం 50 టిఎంసిలు. కాళేశ్వరం జలాలను మల్లన్నసాగర్ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు అభిషేకించి మొక్కు తీర్చుకున్నాం. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంతో పాటు, సస్యశ్యామల తెలంగాణను కూడా కన్నుల పండుగగా చూసుకోగలగటం గర్వకారణం.

పెరిగిన సాగు విస్తీర్ణం.. తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 85.89 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. రాష్ట్రంలో అన్ని సాగునీటి వ్యవస్థలు, ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాం లు, ఆనకట్టలు, కత్వలు, చిన్న, పెద్ద ఎత్తిపోతల పథకాలు ఒకే గొడుగు కిందకి తెచ్చి సాగునీటి శాఖను పునర్వ్యవస్థీకరించడం జరిగింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే ధ్యేయంగా రెట్టించిన ఉత్సాహంతో  ముందుకు సాగుతున్నాం.

అణగారిన దళితజాతి అభ్యున్నతి కోసం దళితబంధు.. సమాజంలో అనాదిగా అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే ధ్యేయంగా, దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా, తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు  పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నాం. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి, సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కలిగించాలని, దళితులంతా స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఆ లక్ష్య సాధనకోసం నేనే స్వయంగా దళితబంధు పథకానికి రూపకల్పన చేశాను. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇది రుణం కాదు. తిరిగి చెల్లించే పనిలేదు. పూర్తి గ్రాంటుగా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన, వచ్చిన పనిని లబ్దిదారుడు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. అంతేకాదు కొందరు లబ్దిదారులు ఒక సమూహంగా ఏర్పడి కూడా వ్యాపార ఉపాధి మార్గాన్ని ఏర్పాటుచేసుకోవచ్చు. ఏ విషయంలోనూ లబ్దిదారునిపై ఎటువంటి ఆంక్షలు విధించకపోవటమే ఈ పథకం గొప్పతనం. దళితబంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ దశలవారీగా దళితబంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఇక దళితబంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ కూడా ఏర్పాటు చేస్తున్నది. దళితబంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం కాలక్రమంలో  ఏదైనా ఆపదకు గురైతే, ఆ కుటుంబం ఆ ఆపద నుండి తేరుకొని తిరిగి ఆర్థికంగా, మరింత పటిష్టంగా నిలదొక్కుకోవడానికి ఈ నిధి దోహద పడుతుంది.

గూడు లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్.. గూడు లేని నిరుపేదలకు  సొంత ఇంటి కలను తీర్చడమే కాకుండా గౌరవ ప్రదమైన నివాసాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. దేశంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వం ఇప్పటివరకు 2.91 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇందుకోసం రూ. 19,126 కోట్లు కేటాయించింది. స్వంత స్థలం కలిగిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి దశలవారీగా 3 లక్షల రూపాయలు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారునికి అందే వరకూ ఈ పథకం అమలవుతుంది.

విద్యారంగంలో పెను మార్పులు.. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ వికాసం కోసం మొదటిదశలో గురుకుల విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యార్థినీ, విద్యార్థులకు సమగ్ర శిక్షణనిస్తూ ఈ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం “మన ఊరు – మన బడి” అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికింది. వర్తమాన కాల అవసరాలకు తగినట్టుగా పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయల వ్యయంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడతోంది. మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయల వ్యయంతో కార్యాచరణ ప్రారంభించింది. ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

ఆరోగ్య రంగం.. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలనేది ప్రభుత్వ ఆశయం. ఇందులో భాగంగానే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషిచేస్తోంది. ప్రజావైద్యం, ఆరోగ్య రంగాలలో రోజురోజుకూ గుణాత్మక పురోగతిని సాధిస్తోంది. తెలంగాణ అవతరణ అనంతరం రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న దృఢసంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ముందుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌళిక సదుపాయాలు మెరుగుపరచటం జరిగింది. 57 వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారి కోసం 42 ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేశాం. దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రంలోని అన్ని బెడ్స్‌ను ఆక్సీజన్ బెడ్స్‌గా మార్చేశాం. 56 వేల ఆక్సీజన్ బెడ్లు నేడు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆసుపత్రులలో హార్ట్ సర్జరీల కోసం క్యాథ్ ల్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి తెవడం జరిగింది. నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకీలు మార్పిడి ఆపరేషన్లు సైతం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుత్రులలో పడకల సంఖ్య పెంచడం, ఉత్తమ వైద్యసేవలతోపాటు రోగులకు మంచి పౌష్టికాహారం అందించడానికీ, పారిశుధ్య ప్రమాణాలు పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచడం జరిగింది. అలాగే ప్రభుత్వం జిహెచ్ఎంసి పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాలలో రోగుల సహాయకులకు కూడా ఐదు రూపాయలకే భోజనం అందిస్తోంది.

సత్ఫలితాలనిచ్చిన కేసీఆర్ కిట్.. మాతా శిశు సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలను ఇచ్చింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లికి 13,000 రూపాయలను, మగపిల్లవానికి జన్మనిచ్చిన తల్లికి 12,000 రూపాయలను ఈ పథకం ద్వారా అందజేయడం జరుగుతోంది. ఇంకా గర్భిణీ స్త్రీలను హాస్పిటల్‌కు తీసుకురావడం, ప్రసవానంతరం తిరిగి ఇంటికి చేర్చడం కోసం ప్రభుత్వం 300 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. హైరిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడంలోనూ, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడంలోనూ తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది అని ముఖ్యమంత్రి చెప్పారు.