Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: గెల్లు చేతిలో ఓడతానన్నది ఈటల భయం.. అందుకే నన్ను పోటీకి పిలుస్తున్నారు : ఆర్థిక మంత్రి హరీశ్ రావు

హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ చేతిలో ఓడతానన్నది ఈటల భయం అన్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. "అందుకే నన్ను పోటీకి

Harish Rao: గెల్లు చేతిలో ఓడతానన్నది ఈటల భయం.. అందుకే నన్ను పోటీకి పిలుస్తున్నారు : ఆర్థిక మంత్రి హరీశ్ రావు
Harish Rao
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 12, 2021 | 6:15 PM

Huzurabad By Election Campaign: హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ చేతిలో ఓడతానన్నది ఈటల భయం అన్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. “అందుకే నన్ను పోటీకి పిలుస్తున్నారు. నేనైనా, గెల్లు అయినా ఈటలపై గెలుపు ఖాయం.” అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వ్యతిరేక పార్టీ అని హరీశ్ వ్యాఖ్యానించారు. ఇవాళ జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇల్లందకుంటకు చెందిన బీజేపీ యువ నేత అజయ్ యాదవ్ నేతృత్వంలో 500 మంది తెరాసలో చేరారు.

ఈ సమావేశంలో హరీశ్ ప్రసంగిస్తూ..” గెల్లు శ్రీనివాస్ పేరులోనే గెలుపు ఉంది. ఆయన ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతకముందే హుజురాబాద్ టౌన్ లోని 3 వేల మంది మున్నూరు కాపులు ఏకగ్రీవ తీర్మానం చేసి గెల్లును గెలిపిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి 130 కేసులున్న గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలి. తెలంగాణ అసెంబ్లీలో మూడు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించినా ఇప్పటి వరకు స్పందన లేదు. బీసీలకు మంత్రిత్వశాఖ పెట్టాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని, దేశంలో బీసీల జనాభా లెక్కించాలని కోరాం.. వీటిపై స్పందన లేదు.” అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

“ఇటీవల కేరళ నుంచి మురళీధరన్ అనే కేంద్ర మంత్రిని తెచ్చి ఇక్కడ మాట్లాడించారు. 28 మంది బీసీలకు కేంద్రమంత్రి పదవులిచ్చామని ఆయన గొప్పలు చెప్పాడు. కానీ బీసీలకోసం ఓ మంత్రిని ఎందుకు పెట్టలేదు. బీజేపీ అంటేనే దళిత, గిరిజన, మైనార్టీ, బలహీనవర్గాల వ్యతిరేక పార్టీ. టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటి వరకు ప్రజల కోసం తెచ్చిన సంక్షేమ పథకాలు, చేసిన పనులు చెప్పి ఓటడుగుతోంది. మరి మీరేం చెప్పి ఓటడుగుతారు? గ్యాస్, పెట్రోలు, డీజీల్ ధరలు పెంచామని ఓటడుగుతారా? ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతున్నందుకు ఓటగుతారా? కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచి కనీసం ఒక్క కమ్యూనిటీ హాలైనా కట్టాడా? మరి ఈటల ఆ పార్టీ నుంచి గెలిచి ఏం చేయగలడు? అంటూ హరీశ్ ప్రశ్నలు కురిపించారు.

“ఈటల మాటలు చూస్తే.. ప్రస్టేషన్ కనిపిస్తోంది. ఓటమి భయం పట్టుకున్నట్లుంది. ఆయన సహానాన్నే కాదు.. విజ్ఞతను కూడా కోల్పోయాడు. దళిత ఎమ్మెల్యేలను పట్టుకుని నీ సంగతి చూస్తానని, రారా, పోరా అని మాట్లాడుతున్నాడు. ఓడిపోతానన్న భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. యువకుడైన, కార్యకర్త చేతిలో గెల్లు శ్రీనివాస్ చేతిలో ఓడిపోతున్నాననే భయం పట్టుకుంది. అందుకే ప్రతి సారి నన్ను పోటీకి రమ్మంటున్నాడు. ఓడిపోయినా మంచిదే కానీ.. పెద్దోళ్ల చేతిలో ఓడిపోదామనుకుంటున్నాడు. నీకు మా గెల్లు శ్రీను చాలు. నేను ఇక్కడ పోటీచేస్తే మా గెలుస్తా.. కానీ మళ్లీ సిద్ధిపేటకు ఉప ఎన్నిక ఎందుకు? నేను అవసరం లేదు.. తప్పకుండా గెల్లు శ్రీనివాస్ ను గెలిపించుకునేందుకు అన్ని వర్గాలు కదలుతున్నారు.” అని హరీశ్ అన్నారు.

“ప్రతి రోజు వందల మంది టీఆర్ఎస్ లో చేరుతున్నారు. మొదట్లో నీ మొసలి కన్నీరుచూసి, నీ మాయమాటలు నమ్మి కొందరు నీ వైపు వచ్చారు. కానీ పాలేవో, నీళ్లేవో వాళ్లకు అర్థమై మళ్లీ మా దగ్గరకు వస్తున్నారు. ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి.. టీఆర్ఎస్ వైపు నిలబడుతున్నారు. గెల్లు శ్రీనివాస్ కు ఎన్నికల డిపాజిట్ మేమే కడుతామని హుజురాబాద్ మెకానిక్ లు నిన్న చెప్పారు. రెండు గుంటలున్న బిడ్డకు ఆస్తులు లేకపోవచ్చు. కానీ ఆయనలో ప్రేమ ఉంది. ఓటేసే ముందు ఆడబిడ్డలంతా సిలిండర్ కు దండం పెట్టుకుని పోలింగ్ బూత్ కు వెళ్లండి. అప్పుడు మీ చేయి సరిగ్గా కారు గుర్తు దగ్గరకే పోతుంది. సిలిండర్ ధర పెంచిన బీజేపీకి మీరు ఓటువేసారో.. మళ్లీ వెయ్యి నుంచి 1500 అవుతుంది జాగ్రత్త. నాకు తెలిసి ఆడబిడ్డలెవరూ బీజేపీకి ఓటేయరు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటికరిస్తే.. ఇక రిజర్వేషన్లు ఉండవు. ఉద్యోగాలిచ్చే పార్టీ టీఆర్ఎస్… ఉద్యోగాలు ఊడగొట్టే పార్టీ బీజేపీ” అని హరీశ్ కేంద్రంలోని బీజేపీ సర్కారు మీద ఘాటు విమర్శలు ఎక్కుపెట్టారు.

Read also: Raja Singh: హుస్సేన్ సాగర్‌లో కాకుండా ఎక్కడ నిమజ్జనం చేయాలో పోలీసులు చెప్పాలి: ఎమ్మెల్యే రాజాసింగ్