Etela Rajender: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. బుధవారం నాడు.. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన బీజేపీ నూతన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుట్ర దారుడు, మోసగాడు, కుట్రలు, కుతంత్రాలు తప్ప ప్రజలమీద ప్రేమ లేదు అంటూ పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టం అని ప్రజలు అంటున్నారని వ్యాఖ్యానించారు. దళితుల మీద ప్రేమ ఉంటే వారి జనాభా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలని, అణగారిన వర్గాలకు కేసీఆర్ మీద విశ్వసనీయత లేదన్నారు.
ఎన్నడూ లేని విధంగా కొన్ని వర్గలమీద ఎనలేని ప్రేమ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పుట్టుకొస్తోందని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రతి పేదవాడికి అందించాలని డిమాండ్ చేశారు. వైద్యానికి బడ్జెట్ పెంచమని తాను మంత్రిగా ఉన్నప్పుడు అడిగానని, కానీ తనకు ఎక్కడ క్రెడిబిలిటీ వస్తుందో తాను బయటికి వచ్చిన తరువాత ఇప్పుడు ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఎన్నిక వారి వైఫల్యాన్ని ఎత్తి చూపిందన్నారు. ఈ ఎన్నిక సీఎం కేసీఆర్‌ను ఫాంహౌస్ నుండి బయటకు పరుగులు తీయించిందని వ్యాఖ్యానించారు. ప్రజల బాగోగులు పట్టించుకోకపోతే పుట్టగతులు ఉండవనే భయాన్ని ఆయనలో లేపిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 85 శాతం బడుగు బలహీనర్గాలకు చెందిన వారే ఉన్నారని, ఈ విషయాన్ని ఏడు సంవత్సరాలు సీఎం మర్చిపోయారని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. దళిత సీఎం దేవుడెరుగు.. ఉపముఖ్యమంత్రి ని కూడా తీసివేసి దళితులను అవమానపరిచారని విమర్శించారు. జనాభాలో 16 శాతం ఉన్నవారికి ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి? 0.5 శాతం ఉన్నవారికి ఎన్ని పదవులు ఉన్నాయి? అని ఈటల ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే ఎస్సీ లకు జనాభా ప్రాతిపదికన మంత్రి వర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక సీఎం కార్యాలయంలో ఎంత మంది బడుగు బలహీన వర్గాల ఐఏఎస్ అధికారులు ఉన్నారని నిలదీశారు. ఉద్యోగులు అందరూ సంఘాలు పెట్టుకుంటే అణచి వేసిన వ్యక్తి కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. భూపాలపల్లి కలెక్టర్ గా ఎంతో గొప్పగా పని చేసిన మురళినీ అక్కడినుండి తీసివేసి ఎక్కడో వేస్తే ఆయన పదవిని వదిలిపెట్టి పోయారని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో దళితుల డబ్బును టాంక్ బండ్ మీద విగ్రహాలకు ఖర్చు చేస్తారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీదనా? అని అడిగానని గుర్తు చేసుకున్న ఈటల రాజేందర్.. తెలంగాణ ఏర్పాటైన తరువాత కూడా అదే జరుగుతోందన్నారు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో దళిత వర్గాల కోసం వెయ్యి కోట్ల రూపాయలు అయినా ఖర్చు పెట్టరా? అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ధరణి పేరుతో ఇటీవల తీసుకు వచ్చిన చట్టం ద్వారా ఎన్నో ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిని మళ్లీ దొరలకు అప్పజెప్పారని దుయ్యబట్టారు.
మూడు ఎకరాల భూమి స్కీమ్ ప్రకటనలకే పరిమితమైంది తప్ప.. దానివల్ల పేదల జీవితాలకు ఒరిగిందేమీ లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో బడుగులు సంతోష పడలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో నియోజకవర్గాల్లోనే తప్ప మిగిలిన నియోజకవర్గా్ల్లో కట్టలేకపోతున్నారని విమర్శించారు. సీఎం చెప్పిందే వేదం తప్ప మంత్రుల అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇక్కడికి వచ్చిన మంత్రులు నిధులు ఇస్తామని, భవనాలు ఇస్తామని చెప్తున్నారని, మొత్తం రాష్ట్రంలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే అబద్ధాలు చెప్పాలి.. గెలవాలి.. ఇదే కేసీఆర్ నైజం అని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. నాగార్జున సాగర్ లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అది ఇస్తా.. ఇది ఇస్తా అని చెప్పడానికి ఇదేమీ మీ జాగీరు కాదంటూ తీవ్ర స్వరంతో ఫైర్ అయ్యారు.
ఇదే సమయంలో పోలీసు అధికారుల తీరుపైనా ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రభాకర్ రావుపై నిప్పులు చెరిగారు. ప్రభాకర రావు చట్టానికి లోబడి పని చేస్తున్నారా? చుట్టానికి లోబడి పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇంటిలిజెన్స్ పోలీసులా? తెరాస కార్యకర్తలా? అని ఫైర్ అయ్యారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పని చేసుకో.. కానీ ప్రజల డబ్బులు జీతంగా తీసుకొని ఇలా చేస్తే చూస్తూ ఊరుకోము. మిమ్మల్ని చూస్తుంటే ఇజ్జత్ పోతుంది.. ప్రజలు ఈసడిచుకుంటున్నరు. ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటారు. కర్రు కాల్చి వాత పెడతారు.’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘ఈటెల రాజేందర్ గెలిస్తెనే ధర్మం గెలుస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. 18 సంవత్సరాల కాలంలో సైనికునిలా పని చేసిన. మీరు గోడల మీద, ఫ్లెక్సీ ల మీద ఉంటారు. కానీ నేను ప్రజల హృదయాల్లో ఉంటా. ప్రజల నుండి నన్ను విడదీయలేరు. 2006 ఎన్నికల్లో ఎలా ధర్మం గెలిచిందో ఇప్పుడు కూడా హుజూరాబాద్ లో కాషాయ జెండానే గెలుస్తుంది. ఉద్యమంలో, మంత్రిగా ప్రజల పక్షాన ఉన్నాను. నాకు ఇచ్చిన పదవులు ప్రజలు ఇచ్చినవి.’’ అని రాజేందర్ చెప్పుకొచ్చారు.
‘‘ఐకేపీ సెంటర్స్ ఉంటాయి, వడ్లు కొంటాయి అని చెప్పడం తిరుగు బాటు అవుతుందా? అదేమన్నా ప్రభుత్వాన్ని కూల్చే పనా? పెన్షన్ ఇవ్వాలి అని అడిగడం తప్పా? సంపూర్ణ మెజారిటీ వచ్చిన తరువాత కూడా మంత్రి వర్గం ఏర్పాటు చేయని వ్యక్తి కేసీఆర్. నీడను చూసి భయపడింది మీరు. ఈ రాజ్యాంగం ఎందీ, నేను ఒక్కడినే చక్రవర్తిని అని ఫీల్ అయ్యింది మీరు. నేను కరోనా పేషంట్ల కోసం ప్రజల చుట్టూ తిరుగుతుంటే.. మీరు నా మీద కుట్ర చేశారు. కేసీఆర్ కుట్రల గురించి ఆలోచించారు. నేను ప్రజల గురించి ఆలోచించాను. కేసీఆర్.. ఇక నీ ఆటలు సాగవు. ఈటెల రాజేందర్ ను బొందుగ పిసకాలి.. బొంద పెట్టాలి.. అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రతిపక్షం వారిని కొనుక్కొని మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. అలా చేయడం ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లేనా?’’ అని వ్యాఖ్యానించారు ఈటల రాజేందర్.
‘‘సీఎం కేసీఆర్ కు కుట్రలు, కుతంత్రాలు తప్ప ప్రజల మీద ప్రేమే లేదు. మంత్రిగా కాదు.. మనిషిగా చూడమని కొరినం. ఈ రోజు ఏ మంత్రి అయితే నా మీద కుట్రలు చేస్తున్నాడో.. ఆ మంత్రి భార్య ఒక నాడు సీఎం కేసీఆర్ ఫోటోను బయటికి విసిరేసింది. నన్ను తిడుతున్న మంత్రి ఒక నాడు నన్ను భుజాల మీద ఎత్తుకొని తిరిగాడు. కరీంనగర్, హుజూరాబాద్‌లో అభివృద్ధికి నిధులు ఇచ్చింది నేను. ఈటెల రాజేందర్ కు సీఎం ద్రోహం చేశారు అని ప్రజలందరూ అంటున్నారు. నీతిగా, నిజాయితీగా, డబ్బులు పంచకుండా టీఆర్ఎస్ పోటీ చేస్తే నేను గెలిచినా రాజీనామా చేస్తా. ధర్మంగా పోటీ చేస్తే
హుజూరాబాద్‌లో మా ప్రత్యర్థుల కు డిపాజిట్లు కూడా రావు. రాష్ట్రంలో పాలన సవ్యంగా జరగడం లేదు. అందుకే సోషల్ మీడియాలో ప్రజలు ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టం అంటున్నారు. ఈ ప్రభుత్వం మీద అణగారిన వర్గాలకు విశ్వసనీయత లేదు. ఇది కొనసాగదు. ప్రజలే తిప్పికొడతారు. దళితులకు న్యాయం జరగకుండా దేశం బాగుపడదు.’’ అని ఈటల రాజేందర్ అన్నారు.
Also read:
New Planet: భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రరాశిలో మూడో గ్రహాన్ని కనిపెట్టిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ