మాజీ ఐపీఎస్ అధికారి RS ప్రవీణ్ కుమార్.. ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో బహుశా తెలియని వారు ఉండకపోవచ్చు. ఈ మధ్యే ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్చంద విరమణ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ సభలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. దళితులకు రాజ్యాధికారం కావాలని సభలో ప్రసంగాలు చేస్తూ అందరినీ ఏకం చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ప్రవీణ్ కుమార్ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సభలో ఓ పాట పాడి అందర్ని ఆశ్యర్యానికి గురి చేశారు.
దొరలపై ఆర్ నారాయణ మూర్తి సంధించిన అస్త్రం ఆ పాట
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి నటించిన ఎర్రసైన్యం సినిమాలోని పాటను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాడారు. ఈ ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. పల్లే మనదిరా.. ప్రతి పనికి మనం రా అంటూ.. పాట పాడుతూ సభికులను ఉత్సాహపరిచారు. తెలంగాణలో దొరల అరాచకానికి వ్యతిరేకంగా తీసిన ఆ సినిమాలోని పాట తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనం సృష్టించింది. ఈ పాటలకు ఆకర్షితులై చాలా మంది నక్షలైట్ ఉద్యమంలో కూడా చేరినట్లు చెబుతారు. అప్పుడు ఈ పాటల్ని అభిమానించి ఆదరించిన వారిని ఎన్‌కౌంటర్ పేర్లతో ఖతం చేయగా…ఇప్పుడు ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోటి నుంచి ఇదే పాట రావడం చర్చనీయాంశంగా మారింది.
(విజయ్ సాతా, టీవీ9 తెలుగు, హైదరాబాద్)