
హైదరాబాద్, నవంబర్ 01: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)- జనసేన మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చింది. పొత్తుల్లో భాగంగా జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్టు తెలిసింది. అయితే జనసేన మరిన్ని సీట్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో రెండు సీట్లు పెంచి గరిష్టంగా 11 సీట్ల వరకు ఇవ్వడానికి కూడా కమలదళం సిద్ధపడినట్టు సమాచారం. బీజేపీతో పొత్తుల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతుండగా.. కూకట్‌పల్లిని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకున్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగతా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మిగిలింది 29రోజులే!. అందుకే, ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి!.. ఒకవైపు ప్రజా ఆశీర్వాద సభలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతుంటే, మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వరుస పర్యటనలతో తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక, బీజేపీ కూడా దూకుడు పెంచింది. పెండింగ్ సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించి ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు రెడీ అవుతోంది.
ఈ రాత్రికి తుది జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది బీజేపీ. ఈ సాయంత్రం ఢిల్లీలో సమావేశం కాబోతున్న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ… ఫైనల్ లిస్ట్‌ను ఖరారు చేయబోతోంది. అలాగే, జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపైనా నిర్ణయం తీసుకోనుంది బీజేపీ సీఈసీ.
జనసేనకు 9 నుంచి 11 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను కోరుతోంది జనసేన. అలాగే… ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మరికొన్ని సీట్లు అడుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి