
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ల కేటాయింపులతో నెలకొన్న అసమ్మతిని చల్లారుస్తూనే, ఇతర పార్టీల నేతలను తమ వైపు రప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లోకి వివిధ పార్టీ నేతల చేరికలు కొనసాగుతున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌కు దూరమై.. ఇతర పార్టీల్లో చేరిన ముఖ్య నేతలను తిరిగి సొంత గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో స్వయంగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం. బీజేపీ వీడి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యమే పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అవకాశం వదులుకోవడానికి సిద్దంగా లేదు. ఇతర పార్టీల నుంచే వచ్చే ముఖ్య నేతలందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగాద వ్యవహారించి పార్టీ వీడిన నాయకులందరిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో తండ్రి గుడిసెల వెంకటస్వామి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వివేక్ వెంకటస్వామి ఎంపీగా వ్యవహరించారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరిపోయారు. అయితే ప్రస్తుతం కొంత కాలంగా బీజేపీలో అంటి ముట్టనట్లు వ్యహరిస్తున్న వివేక్ వెంకట స్వామికి చెన్నూరు అసెంబ్లీ టికెట్‌ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. అయినప్పటికీ తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ వివేక్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌజ్ లో వీరిద్దరూ సమావేశం అయ్యారని తెలుస్తుంది. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపైన ప్రధానంగా చర్చించారు. వివేక్‌ను కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని.. ప్రాధాన్యత ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్దుల జాబితా దాదాపుగా పూర్తి అయింది. దీంతో, కాంగ్రెస్ ఎంపీగా వివేక్ పోటీ చేయాలని రేవంత్ కోరినట్లు సమాచారం.
ఇటీవలె బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనకు మునుగోడు సీటు ఖాయం చేసింది అధిష్టానం. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వివేక్ తో పాటుగా బీజేపీలో కీలకంగా ఉన్న మరికొందరు నేతలతోనూ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలావుంటే కొద్ది రోజుల క్రితమే తాను బీజేపీతోనే ఉంటానని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వివేక్ అపాయిమెంట్ ఇవ్వడం, స్వయంగా కలుసుకోవడం చర్చలు జరపడం ఈ పరిణామాలు పార్టీ మారుతారన్న వాదనలకు బలం చేకూర్చుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరికల జోష్ కొనసాగించేలా రేవంత్ రెడ్డి వ్యూహాలు పదును పెడుతున్నారు. దీంతో, ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…