
ఖాకీల కళ్ళు గప్పి కారు బ్యానేట్‌లో అక్రమంగా తరలిస్తున్న కరెన్సీ కాలి బూడిదయ్యింది. లక్షలాది రూపాయల నోట్ల కట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. నడిరోడ్డుపై జరిగిన ఆ ప్రమాదం ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారింది. ఆ కరెన్సీ ఏ పార్టీకి చెందినది..? ఎక్కడి నుండి ఎటువైపు తరలిస్తున్నారు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం మొదలైంది. ఓటర్లకు డబ్బు పంపకాలకు తెర దించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ కట్టడి చేస్తోంది. అడుగడుగునా చెక్ పోస్టులు, ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు భద్రతా దళాలు. ఈ నేపథ్యంలో పోలీసుల నిఘా నీడను ఛేదించుకుని అక్రమంగా డబ్బు తరలించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. కారులో అక్రమంగా తరలిస్తున్న లక్షలాది రూపాయల కరెన్సీ కాలి బూడిద అయ్యింది. ఈ ప్రమాదం వరంగల్ మహానగరం సమీపంలోని బోల్లికుంట వద్ద జరిగింది.
ప్రధాన రహదారిపై వెళ్తున్న కారు బ్యానేట్‌లో పొగలు చెలరేగాయి. అకస్మాత్తుగా పొగలు కారు అంతా వ్యాపించాయి. వెంటనే కారు పక్కకు ఆపిన డ్రైవర్ అక్క వదిలేసి పారిపోయాడు. కారులో మంటలు చెలరేగుతున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసి కారు బ్యానేట్ తెరిచి చూసి షాక్ అయ్యారు. కారు ఇంజన్‌కు ఆనకుని కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కారు బ్యాటరీలో డబ్బు భద్రపరచి అక్రమంగా తరలిస్తుoడగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి గురైన కారును ఫాలో అవుతున్న మరో కారులో డ్రైవర్ తో సహా ఫాలోవర్స్ పారిపోయారు. కాలిపోయిన కరెన్సీ కట్టలతో పాటు, కారు ను పోలిస్ స్టేషన్ కు తరలించారు. TS09 EL T/R 6645 టెంపరరీ నెంబర్ గల కారులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నుండి వరంగల్ మీదుగా తొర్రూరు వైపు వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు బావిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కారులో కాలిన కరెన్సీ ఎవరిది..? ఏ పార్టీకి చెందినది..? ఎక్కడి నుండి ఎటు వైపు తరలిస్తున్నారు..? మొత్తం ఎంత డబ్బు తరలిస్తున్నారు..? ఎన్ని చెక్ పోస్టులు దాటించారు..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది.
ఇదిలావుంటే సుమారు 15 లక్షల రూపాయలకు పైగా కాలి పోయినట్లు సమాచారం. అచ్చం సినీఫక్కీలో తరలిస్తున్న ఈ కరెన్సీ కట్టలను ఖాకీ నిఘా నేత్రం పసిగట్టలేక పోయింది. అగ్ని ప్రమాదం అక్రమ రవాణా గుట్టు రట్టు చేసింది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…