AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress-CPI-CPM: లెఫ్టా..రైటా..? కాంగ్రెస్‌ – వామపక్షాల పొత్తు కథా చిత్రమ్.. అయోమయంలో కామ్రెడ్లు..!

Telangana Elections: లెఫ్టా..రైటా..? ముందుకా..వెనక్కా..? ఇదీ తెలంగాణలో కాంగ్రెస్‌-వామపక్షాల పొత్తు కథా చిత్రమ్. నామినేషన్లకు గడువు ముంచుకొస్తున్నా కూడా.. లెఫ్ట్‌ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు చర్చలు కొలిక్కి రావడం లేదు. దీంతో ఇటు లెఫ్ట్‌ పార్టీల్లోనూ..అటు హస్తం పార్టీలోనూ సస్పెన్స్‌ కొనసాగుతోంది. నిన్నటివరకు సీపీఐకి రెండు.. సీపీఎం కు రెండు స్థానాలంటూ ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ సీన్ మారింది. ఈ క్రమంలో కామ్రెడ్లు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము విధించిన గడువు ముగిసినా కూడా కాంగ్రెస్‌ నుంచి స్పందన రాకపోవడంతో సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

Congress-CPI-CPM: లెఫ్టా..రైటా..? కాంగ్రెస్‌ - వామపక్షాల పొత్తు కథా చిత్రమ్.. అయోమయంలో కామ్రెడ్లు..!
CPI Congress CPM
Shaik Madar Saheb
|

Updated on: Nov 01, 2023 | 4:47 PM

Share

Telangana Elections: లెఫ్టా..రైటా..? ముందుకా..వెనక్కా..? ఇదీ తెలంగాణలో కాంగ్రెస్‌-వామపక్షాల పొత్తు కథా చిత్రమ్. నామినేషన్లకు గడువు ముంచుకొస్తున్నా కూడా.. లెఫ్ట్‌ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు చర్చలు కొలిక్కి రావడం లేదు. దీంతో ఇటు లెఫ్ట్‌ పార్టీల్లోనూ..అటు హస్తం పార్టీలోనూ సస్పెన్స్‌ కొనసాగుతోంది. నిన్నటివరకు సీపీఐకి రెండు.. సీపీఎం కు రెండు స్థానాలంటూ ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ సీన్ మారింది. ఈ క్రమంలో కామ్రెడ్లు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము విధించిన గడువు ముగిసినా కూడా కాంగ్రెస్‌ నుంచి స్పందన రాకపోవడంతో సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పొత్తుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము పాలేరు, భద్రాచలం అడిగితే.. వైరా, మిర్యాలగూడ ఇస్తామన్నారని ఇప్పుడేమో.. హైదరాబాద్‌లో ఒక సీటు ఇస్తామంటున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సీపీఐ కలిసొస్తే ఓకే… లేదంటే ఒంటరిగానే సీపీఎం పోటీ చేస్తుందని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కూటమి ధర్మం పాటించకపోతే నష్టపోయేది కాంగ్రెస్సే అని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. వామపక్షాలను కాదనుకుంటే తెలంగాణలో అధికారం దక్కదని హెచ్చరించారు.

సీపీఎం.. సంగతి ఇలా ఉంటే.. సీపీఐ మాత్రం తమ ప్రయాణం కాంగ్రెస్‌తోనేనని చెబుతోంది. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం నుండి తమకు స్పష్టమైన భరోసా ఉందంటున్నారు ఆ పార్టీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కొత్తగూడెం, బెల్లంపల్లి సీట్లు తాము కోరామని అయితే బెల్లంపల్లి కాకుండా చెన్నూరు తీసుకోమని కాంగ్రెస్‌ చెప్పిందన్నారు. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరినా కూడా తమ సీటుకు వచ్చిన ఇబ్బంది లేదన్నారు. వివేక్‌ కాంగ్రెస్‌లో చేరడం శుభపరిణామమన్న నారాయణ.. చెన్నూరులో తమ గెలుపునకు వివేక్‌ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌తో తమ పొత్తు ఉంటుందన్నారు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా. తాము అడిగిన సీట్లు కాంగ్రెస్‌ పార్టీ ఇస్తుందన్న నమ్మకం ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు కలిసి వచ్చిన వారితో పొత్తులు ఉంటాయన్నారు.

సీపీఐ, సీపీఎం సమావేశం..

ఈ క్రమంలో సీపీఐ, సీపీఎం కార్యవర్గాలు విడివిడిగా సమావేశమయ్యాయి. అయితే, పొత్తుపై కాంగ్రెస్‌ నుంచి సమాధానం లేకపోవడంతో..ఒంటరి పోరుపై సీపీఎం నేతలు చర్చిస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పోటీపై చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ స్పందించకపోతే.. తాము మాత్ర పోటీ చేస్తామని సీపీఎం స్పష్టంచేసింది.. ఈ క్రమంలో సీపీఐ మాత్రం కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటిస్తుందంటూ పేర్కొంది..

మునుగోడు తర్వాత మారిన సీన్..

మునుగోడు ఉపఎన్నికలో తమతో పొత్తు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌…అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరి పోరుకు దిగింది. దీంతో కాంగ్రెస్‌తో జత కట్టాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించుకున్నాయి. అందుకు కాంగ్రెస్‌ కూడా సరేనంది. మొదట్లో సీపీఐ, సీపీఎం చెరో ఐదు స్థానాలు కాంగ్రెస్‌ను కోరగా ఆ తర్వాత జరిగిన చర్చల్లో మూడు చొప్పున సీట్లు ఇవ్వాలని అడిగాయి. చివరకు ఆ సంఖ్య రెండేసి స్థానాల వద్దకు చేరుకుంది. ఇప్పుడు వాటిపై కూడా క్లారిటీ రాకపోవడంతో లెఫ్ట్‌పార్టీల్లో అసంతృప్తి నెలకుంది. దీంతో ఒంటరి పోరుకు సీపీఎం మొగ్గుచూపుతుండగా..సీపీఐ మాత్రం ఇంకా ఆశలు పెట్టుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..