టెక్నాలజీతో చాలా పనులు సులువుగా చేసుకుంటున్నాం. టెక్నాలజీతో ఎక్కడి నుంచైనా ఏ పని అయినా ఇట్టే జరిగిపోతుంది. సాంకేతికతను ప్రైవేట్ రంగంతోపాటు ప్రభుత్వం రంగంలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా టెక్నాలజీ ఉపయోగించి ఓటర్లకు శ్రమను తగ్గిస్తోంది. తాజాగా తెలంగాణ ఎన్నికల సంఘం ఓ ప్రయోగం చేపట్టింది. దేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన మొబైల్ యాప్‌లో ఓటరు ఇంటి నుంచే తన ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలగనుంది. ఇందుకు ఖమ్మం నగర పాలక సంస్థ వేదిక కానుంది.
రేపటి నుంచి ఖమ్మం నగర పాలక సంస్థలో ఓటర్ల వివరాలు మొబైల్ యాప్‌లో రిజిస్టర్ చేయనున్నారు. TSEC E Vote పేరుతో మొబైల్ యాప్ రూపొందించారు. ఖమ్మం నగర పాలక సంస్థ ఓటర్ల జాబితాను ముందుగా యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. యాప్‌లో ఓటరుగా రిజిస్టర్ కావాలనుకునే వ్యక్తి ఫొటోను అధికారులు యాప్‌లో క్యాప్చర్ చేసి అప్‌లోడ్ చేసిన తర్వాత అంతకు ముందు యాప్‌లోని ఫొటోకు సరిపోలాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా ఓటరు పేరుకు ఆధార్ అనుసంధానం అయిన తర్వాత మొబైల్ ఫోన్ నెంబర్ కూడా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ (వన్ టైం పాస్‌వర్డ్) నమోదు అనంతరం యాప్‌లోని సాఫ్ట్‌వేర్ వీటన్నింటినీ సరిపోల్చుకున్న తర్వాత యాప్‌లో ఓటరు పేరు రిజిస్టర్ అవుతుంది.
యాప్‌లో ఓటరు వివరాలు రిజిస్టర్ అయిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు కేటాయించిన సమయంలో ఓటరు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే వీలుంటుంది. దీంతో సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో రేపటి నుంచి ప్రయోగాత్మకంగా మొబైల్ యాప్‌లో ఓటరు వివరాలు రిజిస్ట్రేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, సాంకేతిక బృందం యాప్‌లో ఓటరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నారు.
Read Also.. ‘రాష్ట్రాల హక్కులను హరించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు దొందు దొందే’.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్