తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా వైద్య బృందాలు ఇల్లిల్లూ తిరుగుతూ జ్వరం సహా ఇతర వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు. ఈ గణాంకాల ఆధారంగా గత వారం రోజుల్లో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు లక్షన్నరకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్వహిస్తోన్న కేంద్రాలు సహా ప్రైవేటులో నమోదవుతున్న నిర్ధారణ పరీక్షల సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్ రూపంలో ప్రతి రోజూ విడుదల చేస్తోంది. అందులో వెల్లడైన పాజిటివ్ కేసుల సమాచారానికి అదనంగా ఈ లక్షన్నర మంది బాధితులు నమోదు కావడం కొద్దిగా ఆందోళన కలిగించే అంశం అని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ వైద్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,064 కేంద్రాల్లో ఉచితంగా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గత నెలలో రోజుకు సరాసరిన సుమారు లక్షన్నర పరీక్షలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా మాత్రం ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇప్పుడు రోజూ సగటున సుమారు 60-70 వేల మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రాల వద్ద పెద్దసంఖ్యలో లక్షణాలు ఉన్నవారు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో లక్షణాలు ఉండి కరోనా నిర్ధారణ కానివారు, లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతున్నవారు ఒకేచోట గంటల తరబడి కలిసి ఉండటంతో.. ఆ తర్వాత వారి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది.
ఇలాంటి సమయంలో తమకు తెలియకుండానే ఎదుటి వారికి వైరస్ వ్యాప్తి చెందడానికి ఇలాంటి రద్దీ కారణంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. లక్షణాలున్నప్పటికీ పరీక్షలు చేయించుకోకుండా ఇంటి వద్దనే ఉండటం.. కరోనా నిర్ధారణ కాలేదనే ధైర్యంతో సొంత పనులు చేసుకోవడం… ఇతరులతో కలిసిమెలిసి తిరగడం చేయడం… కుటుంబ సభ్యులకు, తమతో సన్నిహితంగా మెలిగిన వారికి వైరస్ వ్యాపించేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో లక్షణాలున్న వారు కరోనా నిర్ధారణయ్యేలోపే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. నిర్ధారణ కాకుండానే, ఇళ్లలోనే మృత్యువాతపడుతున్నవారు వందల్లోనే ఉంటారని ఓ అంచనా. ఆఖరి నిమిషంలో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్‌లుగా నిర్ధారణవుతున్న వారు కూడా దాదాపు 70 శాతానికి పైగానే ఉంటున్నారని అంచనా.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తోంది. గ్రామీణ, పట్టణాల్లో ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి తదితర సమస్యలున్నవారిని గుర్తిస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే నల్గొండ జిల్లాలో అత్యధికంగా 9,433 మందిని కరోనా లక్షణాలున్నవారిని గుర్తించారు. ఆరోగ్య ఉపకేంద్రం స్థాయిలో ఏఎన్‌ఎంలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఓపీ సేవల్లో 4507 కేసులను గుర్తిస్తే, మహబూబ్‌నగర్ జిల్లాలో 3906 మందిని గుర్తించి కిట్లు అందజేశారు. గడిచిన ఏడు రోజుల్లోనే ఓపీ సేవల్లో దాదాపు 14 లక్షలకు పైగా ఐసొలేషన్ కిట్లను అందజేసినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి.