Telangana: పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అలా ఎలా చేస్తారంటూ..
Telangana: పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో..
Telangana: పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ‘నేను బీజేపీలోకి వెళ్తా అని ఎలా రాస్తారు? మీకేమైనా కల వచ్చిందా? వెళ్తే నేను చెప్పే వెళ్తాను. దేనికీ భయపడే వ్యక్తిని కాదు.’ అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణకు నష్ట పరిహారం కోరడం కోసమే తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అమిత్ షా తో భేటీపై ప్రశ్నలు తలెత్తగా.. ఆ భేటీ గురించి తనకు తెలియదని చెప్పారు.
కనీస సమాచారం ఇవ్వకుండానే చేర్చుకుంటారా?
ఇదే సమయంలో రాష్ట్రంలో చెరుకు సుధాకర్ ఏర్పాటు చేసిన ఇంటిపార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా పార్టీ సభ ఎలా ఏర్పాటు చేస్తారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఓడించడానికి పని చేసిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని నిలదీశారు. అలాంటి వ్యక్తితో తాను చండూరు సభలో పాల్గొనాలా? అని ప్రశ్నించారు. పీసీసీ ప్రెసిడెంట్ తన అసంబద్ధ చర్యలతో ఇబ్బంది పెడుతున్నాడని, తనను అడగకుండానే తన నియోజకవర్గంలో సభ పెట్టారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్‌ను అయిన తనను కనీసం సంప్రదించకుండానే సుధాకర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని రేవంత్‌ను నిలదీశారు వెంకట్ రెడ్డి. దాసోజు శ్రవణ్ కూడా వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోందని, పాత కాంగ్రెస్ నేతలందరినీ వెళ్ల గొడుతున్నావంటూ రేవంత్‌పై నిప్పులు చెరిగారు వెంకట్ రెడ్డి.
వరద సాయం కోరడానికే..
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తెలంగాణకు వరద సాయం ఇవ్వాలని కోరానని వెంకట్ రెడ్డి తెలిపారు. 40 ఏళ్ల తర్వాత అంత భారీ వరదలు తెలంగాణలో వచ్చాయని, రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. తక్షణం రూ 1,000 కోట్లు విడుదల చేయాలని కోరానన్నారు. భారీ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు కూడా మునిగిపోయాయని చెప్పారు. ఈ అంశంపై రూ. 377 కింద పార్లమెంట్‌లో మాట్లాడానని చెప్పారు. ఉదయం ఆర్థిక శాఖ కన్సల్టేటీవ్ కమిటీ సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. తదుపరి జీ20 సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అలాగే అనేక సలహాలు, సూచనలు చేశానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు, గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఈ మూడు సమావేశాలు రాష్ట్రానికి చాలా ముఖ్యం అని, ఇప్పటి వరకు వరదల గురించి టీఆరెస్ నేతలెవరూ మాట్లాడలేదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..