TS Congress – Revanth reddy: తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తుంది. ఇప్పటికే బీజేపీ పాదయాత్ర షురూ చేసింది షర్మిల పార్టీ.. ఇప్పుడు పాదయాత్ర కి రంగం సిద్ధం చేసుకుంటుంది అయితే అందరికంటే ముందే పాదయాత్ర చేస్తాం అని ప్రకటించిన కాంగ్రెస్ పాదయాత్ర పరిస్థితి ఏంటి? ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి? కేవలం ప్రకటనలకే పరిమితమా?అసలు పాదయాత్ర లపై కాంగ్రెస్ కి క్లారిటీ ఏంటి? విశ్లేషిద్దాం..
అధికారంలోకి రావాలంటే పాదయాత్ర తప్పనిసరి అయిపోయినట్లు ప్రస్తుతం నేతలు భావిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు పాదయాత్ర తేదీలను ప్రకటిస్తున్నారు. సమయం సందర్భంతో సంబంధం లేకుండా జనాలతో మమేకం అయ్యేందుకు పాదయాత్రను ప్రధాన ఆయుధంగా రాజకీయ పార్టీలు మలుచుకుంటున్నాయి. రెండో సారి తెలంగాణలో ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వంను గద్దె దించేందుకు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తామనే ప్రకటిస్తే.. బీజేపీ నేతలు పాదయాత్ర చేసి చూపెడుతున్నారు. బీఏస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాదయాత్ర కు సిద్దమవుతుంటే.. షర్మిల పాదయాత్ర కు సన్నాహాలు చేస్తుంది.
అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం అందరికంటే ముందే పాదయాత్ర చేస్తామని ప్రకటించినా ఆచరణ, కార్యాచరణ ఎక్కడ కనిపించడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ అయ్యాక పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే ఎప్పుడు చేస్తాననేది మాత్రం చెప్పలేదు. అంతర్గత కుమ్ములాటలు, ఇతర నాయకుల సహకారం లేకపోవడం వల్ల ప్రస్తుతానికి పాదయాత్ర కి బ్రేక్ పడిందని చెప్తున్నారు రేవంత్ సన్నిహితులు. మరోనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భువనగిరి నుంచి పాదయాత్ర చేస్తా అన్నారు. అదికూడా మాటలకే పరిమితం అయింది. ఇక మరో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా నేను కూడా పాదయాత్ర చేస్తా అని ప్రకటించారు. ఈ ముగ్గురు నేతల ప్రకటనలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయి తప్ప ఆచరణలో కనిపించడం లేదు. హైకమాండ్ పర్మిషన్ కోసం చూస్తున్నామని అనుమతి రాగానే మొదలుపెడతాం అని చెప్పుకొస్తున్నారు
ఓ వైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో దూసుకుపోతుంటే, ముచ్చటగా ముగ్గురు నేతలు పాదయాత్ర చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు మాత్రం.. దళిత, గిరిజన సభ పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభలు నిర్వహించడంలో కూడా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. 17 సభలు నిర్వహించాలనుకున్నా.. నేతల మధ్య అనైక్యతతో 4 సభలకు పరిమితం అయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తమ కార్యాచరణను ఐక్యంగా రూపొందించుకోకుంటే.. కాంగ్రెస్ పరిస్థితి ఇక అంతే అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.
– అశోక్ భీమనపల్లి, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
Read also: CPI Narayana: సీఎం ఫాం హౌస్‌లో ఉంటే అదే రాజధాని అవుతుందా? ఏపీ మంత్రి వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ కౌంటర్