Telangana: 6+6 భద్రత కల్పించాలని డీజీపీకి రేవంత్‌రెడ్డి లేఖ..
తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. 6+6 సెక్యూరిటీ కల్పించాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారాయన. ఎందుకు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి..రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌కు లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తనకు భద్రతను పెంచాలని ఆయన లేఖలో కోరారు. ఎన్నికల ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టు చెప్పినా సెక్యూరిటీ కల్పించడం లేదన్నారు. హైకోర్టులో మాత్రం భారీగా సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని పోలీసులు తప్పుడు వాదనలు చేశారని గుర్తు చేశారు . దీనికి తోడుగా గత జూలైలో తనకు ఉన్న 2+2 భద్రతను సైతం వెనక్కి తీసుకున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తనకు తక్షణమే 6+6 భద్రత కల్పించాలని డీజీపీని కోరారు రేవంత్‌రెడ్డి. లేదంటే కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద కేసు వేస్తానని డీజీపీకి రాసిన లేఖల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర డీజీపీ సెక్యూరిటీ పెంచకుంటే తానూ మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో తన భద్రతపై రేవంత్‌రెడ్డి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర మంతటా పర్యటించాల్సి రావడంతో తనకు భద్రతను పెంచాలని ఆయన డీజీపీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. కోర్టు ఆదేశాలను మాత్రమే తాను అమలు చేయాలని కోరుతున్నట్లు రేవంత్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు మొన్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆయనపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాంతో రేవంత్‌రెడ్డి కూడా వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అందుకే కోర్టు ఆదేశాల ప్రకారం తన భద్రతను పెంచాలని రేవంత్ డీజీపీకి లేఖ రాశారు. మరి ఈ లేఖపై డీజీపీ స్పందిస్తారా..? చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
