
రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలనపై పట్టుసాధించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త దారిలో వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్‌ల నుంచి రోజువారీ వర్క్ రిపోర్ట్ అడుగుతున్నారు. వర్షాలు కురుస్తున్న వేళ పరిపాలన, జనజీవన ఇబ్బందులపై సర్కార్ దృష్టి సారించింది. వానలు, సీజనల్ వ్యాధులు, నీళ్లను ఒడిసిపట్టుకొని అవసరం మేర వినియోగించుకోవడం, యూరియా నిల్వలు, రేషన్ కార్డుల పంపిణీపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల పరిధిలోని ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో తనకు తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వారి కార్యాచరణ రిపోర్టు రోజూ తనకు పంపించాలన్నారు. సీఎంఓ నుంచి కలెక్టర్ల పనితీరుపై రోజువారీ మానిటరింగ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
యూరియా స్టాక్‌కు సంబంధించి ప్రతీ ఎరువుల దుకాణం వద్ద స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కావాల్సినంత యూరియా స్టాక్ ఉందని.. ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.
ఈనెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్‌కార్డుల పంపిణీ చేయాలని ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
భారీ వర్షాల సమయంలో కలెక్టర్లు వెదర్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆయా జిల్లాల్లో అధికారులను అలర్ట్ చేసి ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై చర్యలు తప్పవని సమీక్షలో సీఎం హెచ్చరించడంతో పాటు, కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. సీఎం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో పాలన యంత్రాంగంలో ఎలాంటి మార్పు వస్తుందే చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..