ప్రగతి భవన్.. ఫూలే ప్రజా భవన్‌గా మారింది. ప్రజా భవన్ గేట్లు తెరచుకున్నాయి. దశాబ్ధకాలం తర్వాత సామాన్యుల అడుగులు పడ్డాయి. ఇవాళ ప్రజా భవన్ వేదికగా ధరఖాస్తులు స్వీకరిస్తారు. స్వయంగా సీఎం రేవంత్ ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు.
రేవంత్ రెడ్డి సీఎంగా పాలనా పగ్గాలు చేపడుతూనే కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తొలగించాలని ఆదేశించారు. స్వయంగా ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం, అదే వేదికపై నుంచే ప్రగతి భవన్ కంచె తొలగిస్తున్నట్లు ప్రకటించారు రేవంత్. ఒకవైపు రేవంత్ ప్రమాణం, మరోవైపు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు కంచె తొలగింపు ఒకేసారి జరిగాయి.
గ్యాస్ కట్టర్లతో ఇనుప గ్రిల్స్‌ను కత్తిరించి, తొలగించారు. దీంతో ఇక్కడ రోడ్డు వెడల్పుఅయింది. ఇకపై ప్రగతి భవన్ కాకుండా, జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా మార్చుతున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇకపై ప్రజా భవన్‌కు ఎవరైనా రావొచ్చు, ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఆహ్వానించిన సీఎం రేవంత్, దీనిని ప్రజలు పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరారు .
గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉదయాన్నే ప్రజలతో ప్రత్యక్షంగా కలిసేవారు. ఎవరైనా ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా తమ సమస్యను ఒక కాగితంపై రాసుకుని వెళ్లి నేరుగా సీఎంకు అందించొచ్చు.. దాన్నే ప్రజా దర్బార్ అనేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ వ్యవస్థను ఆపేశారు. ఇన్నాళ్లకు తిరిగి మళ్లీ ప్రజా దర్బార్ ప్రారంభిస్తున్నారు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం పది గంటల నుంచే ప్రజా దర్బార్ ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారం జరుగుతుందని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…