CM KCR Visits Yadadri Temple: ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆలయ ప్రారంభానికి సమయం సమీపిస్తున్న వేళ క్షేత్ర పర్యటనకు వెళ్తున్నారు. 11 గంటలకు యాదాద్రీశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే లక్ష్మీనారసింహుల కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి కేసీఆర్.. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఈనెల 28వ తేదీన ప్రధానాలయం పునఃప్రారంభ నేపథ్యంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై సీఎం కేసీఆర్ ఆరా తీయనున్నారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల క్రితం ప్రగతిభవన్‌లో యాడా, ఆలయ నిర్వాహకులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆలయ పునర్నిర్మాణ పనులు, పునఃప్రారంభ ఏర్పాట్లు, ఆలయ ఉద్ఘాటన పర్వంలో చేపట్టనున్న పంచకుండాత్మక హోమం, మహాకుంభ సంప్రోక్షణ పర్వాలపై చర్చించారు. యాదాద్రిలో ఈనెల 21 నుంచి మహాసుదర్శన యాగం నిర్వహించనుండగా.. 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మహాసుదర్శన యాగ స్థలం, అన్నదానం కాంప్లెక్స్, సత్యనారాయణ వ్రతాలు, దీక్షాపరుల మండపాలు, బస్టాండ్ పనులను సీఎం పరిశీలించనున్నారు. పుష్కరిణి వద్ద స్నానపు గదుల నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకుంటారు.
Also read:
Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 14 మంది దుర్మరణం..
Current Bill: అమ్మో కరెంటు బిల్లు.. చూస్తే గుండె గుభేల్.. మరీ కోట్లలోనా..!