CM KCR press meet: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం పర్యటిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం కేసీఆర్ హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గూడెపహడ్, ములుగు, గోవిందరావుపేట మీదుగా మరికాసేపట్లో ఏటూరునాగారం చేరుకొనున్నారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారానే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఏటూరు నాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో సైతం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావు, దయాకరరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు నరేందర్, గండ్ర వెంకట రమణ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, సీఎంఓ స్మిత సబర్వాల్, కడియం శ్రీహరి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే.. సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల ప్రజలకు పరిహారం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఏటూరునాగరం పర్యటన అనంతరం భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అనంతరం వరద పరిస్థితి, సహాయ, పునరావాస కార్యక్రమాలపై అక్కడి అధికారులతో మాట్లాడనున్నారు.