భారత రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము తొలిసారి తెలంగాణకు వచ్చిన వేళ ఆమెకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. చాలా రోజుల తరువాత ఒకే వేదికపై సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై కనిపించడమే కాక మాటలు కూడా కలిపారు.ప్రగతి భవన్, రాజ్ భవన్‌ల మధ్య నెలకొన్న దూరం ఇకపై ఉండబోదనుకున్నారు అందరూ. ఆ క్రమంలోనే హైదరాబాద్‌కు రాష్ట్రపతి వచ్చిన సందర్భంగా గవర్నర్ తమిళసై ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. గవర్నర్‌తో మాటలు కలిపిన సీఎం కేసీఆర్ కూడా ఈ విందులో హాజరవుతారని అంతా భావించారు. అయితే అంతలోనే సీఎం కేసీఆర్ ట్వీస్ట్ ఇచ్చారు. ఆయన షెడ్యూల్‌లో రాజ్ భవన్‌లోని విందు కార్యక్రమం లేకపోవడంతో ఆయన దూరంగా ఉన్నారు. ఇవాళ రాత్రికి రాష్ట్రపతి గౌరవార్థం ద్రౌపది ముర్ముకు రాజ్‌భవన్‌లో విందు ఇవ్వనున్నారు గవర్నర్ తమిళిసై. ఇకపోతే సోమవారం ఉదయం శ్రీశైలం వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. శ్రీశైల మల్లికార్జున, బ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైకి కొంత కాలంగా వివాదాల పంచాయితీ నడుస్తోంది. గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై తిరస్కరించినప్పటి నుంచి ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య వివాదం రాజుకుంది. ప్రతిసారి పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలను ఒమిక్రాన్ కేసుల కారణంగా ఈ ఏడాది జనవరి 26న ఉత్సవాలను పరిమిత సంఖ్యలో రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలంటూ ప్రభుత్వం నుంచి షెడ్యూలు వెలువడింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న అభిప్రాయాలు అప్పట్లో వెలువడ్డాయి. ఆ క్రమంలోనే సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు ఎవరూ గణతంత్ర వేడుకలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
ఆ తర్వాత ఎంఐఎం సభ్యుడు జాఫ్రీని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీని గురించి ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ అడిగారు. గవర్నర్ తమిళిసై మేడారం జాతరకు వెళ్లిన సందర్భంలోనూ ప్రొటోకాల్ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం పాటించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఇలా ఇరు వర్గాల మధ్య రోజుకో వివాదం చోటు చేసుకుంటుండడంతో ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య దూరం క్రమక్రమంగా ముదురుతూ వచ్చింది. గవర్నర్ తమిళిసై కూడా బాహాటంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పుబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. గవర్నర్‌ను నిమిత్తమాత్రురాలిగా చేయడానికి సీఎంవో ప్రయత్నిస్తోందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ పార్టీల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా ఆమెను పక్కన పెట్టే ప్రయత్నాలు కేసీఆర్ ప్రభుత్వం చేసిందన్న వాదన తెరపైకొచ్చింది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కారణంగా అంటీముట్టనట్టు ఉన్న ఈ ఇద్దరూ మళ్లీ మాట్లాడుకునేంత కాకపోయినా సఖ్యంగా పలకరించుకున్న పరిస్థితి మాత్రం కనిపించింది.