CM KCR Irrigation Review: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న పరిస్థితుల్లో నీటిపారుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భేటీ అయ్యారు. ఇరుగేషన్ అధికారులతోపాటు, వివిధ శాఖ ముఖ్య ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, ఇంజినీర్లు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు సమాచారం.
గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ మధ్య జలజగడం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపాలని తెలంగాణ డిమాండ్ చేస్తుండగా.. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టలలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. జల వివాదంపై ఇరు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
మరోవైపు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో పాటు, వివిధ రాజకీయపక్షాలు పోటా పోటీ విమర్శలకు దిగుతున్నారు. అటు రాష్ట్ర సరిహద్దుల వద్ధ ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక, ప్రాజెక్టుల వద్ద కూడా ప్రత్యేక భద్రత బలగాలతో రెండు రాష్ట్రాలు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ఉన్నతాధికారులతో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.