తెలంగాణ బడ్జెట్ లెక్కలు.. కార్యాచరణ మొదలు పెట్టనున్న ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు
CM KCR On Budget: రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు వేగవంతమైంది. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రతిపాదనలు, కేటాయింపులపై మార్గనిర్దేశం చేశారు. శాఖల వారీగా కేటాయింపులు, ఆర్థిక నివేదికల వివరాలను పరిశీలించారు.
CM KCR Review on Budget Allocations: బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సీఎం కేసీఆర్.. ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. కరోనా కాటు కారణంగా తెలంగాణ రాష్ట్రం 50 వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని లెక్క లేశారు. అయినా బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి.
పద్దుల్లో పొందుపరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలు, ఆర్ధిక నివేదికలను ఆయన పరిశీలించారు. కరోనా అనంతర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని, గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే వుండే ఆస్కారమున్నదన్నారు.
సంక్షేమ, అభివృద్ది పథకాలకు నిధుల కేటాయింపుతో పాటు.. గొర్రెల పెంపకం కార్యక్రమంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఆ పథకం ద్వారా యాదవులు, గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. గొర్రెల పంపిణీని కేంద్రం మెచ్చుకున్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం కేసీఆర్. చేపల పెంపకం కూడా మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. దాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ అంచనాలు. కేటాయింపుల కోసం విధి విధానాలు ఖరారు చేశారు.
ఈ బడ్జెట్ సమావేశాలు మార్చినెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశముందని సీఎం చెప్పారు. సమావేశం లో మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితాసబర్వాల్ పాల్గొన్నారు.
ఆదివారం నుంచి ఆర్థిక మంత్రి హరీశ్ రావు కార్యాచరణ మొదలవుతుంది. ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్, పురపాలక, విద్య, సాగునీటి శాఖలను వరుసగా పిలిచి, ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమావేశాలు నిర్వహిస్తారాయన. అన్ని శాఖలతో కసరత్తు ముగిశాక.. ఫైనల్‌గా సీఎం కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతారు.