Heavy Rains: రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. జనం ఇళ్లల్లోంచి బయటకు రాకండి!

|

Jul 22, 2021 | 1:29 PM

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు.

Heavy Rains: రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. జనం ఇళ్లల్లోంచి బయటకు రాకండి!
Cm Kcr
Follow us on

CM KCR High Level Review on Heavy Rains: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తక్షణమే పర్యవేక్షించాలని యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం సూచించారు. ఇప్పటికే నిర్మల్ పట్టణం నీటమునిగిందని అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.

ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను ,ఎస్పీలను, రెవిన్యూ అధికారులు, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లల్లోంచి బయటకు రావద్దని సీఎం కెసిఆర్ సూచించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్ననేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు.

మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోకి వరద ఉదృతి పెరగనుంది. గోదావరితో పాటు కృష్ణా నదుల్లోకి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి. గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో వుంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ వుండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయా ప్రాంతాల్లోని అన్నిస్థాయి టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా, పార్టీ కార్యకర్తలు నేతలంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Read Also… 

KTR Birthday Gift: తెలంగాణలో దివ్యాంగులకు ఉచితంగా స్కూటీలు.. మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో భారీ స్పందన