Telangana Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో రెండో రోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయశాఖపై చర్చించారు. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు కేబినెట్‌కు సమగ్రంగా వివరించారు. వర్షాకాలంలో సాగు ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల లభ్యత తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. గత ఏడేళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన ఘటన విజయాలను కేబినెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తవించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు, అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీజలాలను చెరువులకు, కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మళ్లించిందని కేసీఆర్ తెలిపారు. గ్రామాల్లో ఒక్క ఎకరం కూడా వదలకుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పెద్దఎత్తున రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.
రాష్ర్టంలోని రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, పంట పెట్టుబడి సాయం రైతు బంధు సహా సకాలంలో ఎరువులు, విత్తనాలను అందిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇలా అన్ని రకాల చర్యల ఫలితంగా గత సంవత్సరం తెలంగాణలో రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయడం జరిగిందని వివరించారు. కరోనా మహమ్మారి కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. గ్రామాల్లోకి వెళ్లి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వరిధాన్యాన్ని పండించే పరిస్థుతులు రాష్ట్రంలో నెలకొన్నాయని, వచ్చే సంవత్సరం ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ధాన్యం నిలువ చేయడం, మార్కెటింగ్ చేయడం పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలన్నారు. రైస్ మిల్లులలో మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, నూతనంగా రైస్ మిల్లులు, పారబాయిల్డ్ మిల్లులను గణనీయంగా స్థాపించాలని అన్నారు.
పౌర సరఫరాల శాఖ సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉండకూడదని, అన్ని పోస్టులను భర్తీ చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. పండిన ధాన్యాన్ని పండినట్టే ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.