రూపు రవ్వంతే.. మనిషి పిడుగంత.. అతనే రేవంత్.. గూబగుయ్యిమనేలా సమాధానం చెప్పడం ఆయన స్టైల్ ఆఫ్ రాజకీయం. తొలి అడుగు నుంచి టీపీసీసీ చీఫ్‌గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే స్థాయి వరకు రేవంత్ నడిచిన దారి రహదారి కాదు.. ముళ్లదారి. ప్రతి అడుగులో అడ్డంకులు.. ప్రతి చర్యలో విమర్శలు.. ప్రతి నిర్ణయంలో వివాదాలు.. ఇవన్ని దాటుకుంటూ అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి పీఠం వైపు దూసుకువచ్చారు.
ముఖ్యమంత్రి కావాలంటే పరిపాలన అనుభవం కాదు, నాయకత్వ లక్షణాలు ఆ పదవికి సరిపోగలమనే అర్హత చాలు అంటూ అనాడు ఎన్టీఆర్ తెచ్చుకున్న గుర్తింపునే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెచ్చుకోవడం హిస్టరీ రిపీట్ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఫలితాలు వెలువడిన వెంటనే అందరి నోట ఒకటే మాట. సీఎం ఎవరూ..? కాంగ్రెస్ పార్టీలో పాలనా అనుభవం ఉన్న సీనియర్ నేతలు, మంత్రులుగా, టీపీసీసీ చీఫ్ గా పని చేసిన అనుభవం ఉన్నవాళ్లు ఉన్నారు. అధిష్టానానికి విధేయులుగా చాలా మంది నేతలు ఉన్నప్పటికి రేవంత్ రెడ్డి పేరు మాత్రమే తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి పీఠానికి రేవంత్ రెడ్డి మాత్రమే అర్హుడని కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో సీఎల్పీ మీటింగ్ లో తేల్చి చెప్పడంతో హైకమాండ్ కూడా ఆయనకే మొగ్గు చూపింది. సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించడంతో పాటు డిసెంబర్ 7న ప్రమాణస్వీకారానికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
రేవంత్‌రెడ్డిది సిల్వర్ స్పూన్ రాజకీయం కాదు. కార్యకర్త స్థాయి నుంచి రాజకీయాలు చేస్తూ…అందులో అనుభవం సంపాదిస్తూ…తనకంటూ ఓ ప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుని మాస్‌లీడర్‌గా ఎదిగారు. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారన్నది విశ్లేషకుల అభిప్రాయం. జడ్పీటీసీగా మొదలైన రాజకీయ ప్రయాణం, వైఎస్‌ఆర్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్ధిగా గెలుపొందడంతో రేవంత్‌రెడ్డి పేరు రాజకీయానికి పరిచయమైంది. వైఎస్‌ఆర్ లాంటి ఆకాశమంత డైనమిక్ లీడర్‌ను ఢీకొని, ఇండిపెండెంట్‌గా నిలబడి గెలవడంతో 2007లో రేవంత్ రెడ్డి పేరు మార్మోగింది.
ఇండిపెండెంట్‌గా మొదలైన రేవంత్ పొలిటికల్ అడుగులు.. తెలుగు దేశం పార్టీ అడుగు పెట్టాక ఆయన రాజకీయం పరుగు అందుకుంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించారు. అక్కడి నుంచి కొండగల్ కోడెగిత్త అనిపిలుపించుకునే స్థాయికి రేవంత్ ఇమేజ్ పెరగసాగింది. ఇలా టీడీపీలో మెట్టు మెట్టూ ఎదుగుతూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, నమ్మినబంటుగా మారి, పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపించారు.
2014నుంచి రేవంత్ రాజకీయం మరో టర్న్ తీసుకుంది. రాష్ట్రవిభజన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినా, తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ పడిపోసాగింది. అలాగే ఒక్కో మరక రేవంత్ రాజకీయ జీవితంపై పడసాగింది. 2009-2014 అసెంబ్లీ ఎన్నికలలో ఈసీకి సమర్పించిన అఫిడవిట్ల కారణంగా రేవంత్ రెడ్డి తొలిసారి అవినీతి మరక పడింది. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆయన తన ఆస్తులు రూ.3.6 కోట్లు గానూ, రూ.73 లక్షలు వరకు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. ఐదేళ్ల తర్వాత అంటే 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ఆస్తుల విలువ రూ.13.12 కోట్లు గానూ, అప్పులు రూ.3.3 కోట్ల వరకు ఉన్నట్లు చూపారు. అంటే కేవలం అయిదేళ్లలోనే ఆయన ఆస్తులు 4 రెట్ల వరకు పెరిగాయన్న మాట. దానిపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సందర్భంలోనే ఓటుకు నోటు అంశం రేవంత్ పొలిటికల్ కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలింది.
2015తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ.. నామినేటెడ్ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్సన్‌కు రేవంత్‌రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఓ స్టింగ్-ఆపరేషన్ వీడియో బయటికొచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఏసీబీ 2015 మేలో రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. దాదాపు నెలరోజుల పాటు జైల్లో ఉండాల్సివచ్చింది. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రేవంత్‌రెడ్డి 2015 జూలై ఒకటో తేదీన విడుదలయ్యారు. ఇది కూడా రేవంత్‌రెడ్డి పాపులారిటీని పెంచేలా చేసిందంటారు రాజకీయ విశ్లేషకులు.
కేసీఆర్‌ను గద్దె దింపడమే తన లక్ష్యం అంటూ చర్లపల్లి జైలునుంచి బయటకు వచ్చిన క్షణంలో రేవంత్ చేసిన సవాల్ ఇది. ఆ లక్ష్యం కోసమే రేవంత్‌రెడ్డి ఇష్టంలేకపోయినా కొందరని కలుపుకున్నారని, మరికొందరితో గొడవపడ్డారని, సొంతపార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా ఓర్చకున్నారు. అమ్ముడుపోయిన రేవంత్‌రెడ్డి అంటూ ప్రత్యర్ధులు తిట్టిపోసినా పంటిబిగువున భరించాడని ఆయన అభిమానులు తరచూ చెప్పేమాట.
ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయం కొండెక్కిందని, ఇక కొండగల్‌కే పరిమితమని హేళన చేసినోళ్ల నోళ్లకు తాళం వేసేలా రేవంత్‌రెడ్డి ఎదిగిన తీరు ప్రశంసనీయమంటారు రాజకీయ విశ్లేషకులు. ఓటుకు నోటు కేసు తర్వాత బెయిల్‌నుంచి విడుదలయ్యాక టీడీపీలో మునుపటి జోరు తగ్గింది. కీలక నేతలంతా ఒక్కొక్కరుగా అధికార పార్టీలోకి జారుకోవడంతో పార్టీ మరింత బలహీనపడింది. దీంతో టీడీపీలో ఉంటే తన టార్గెట్ రీచ్ కాలేమని భావించిన రేవంత్‌రెడ్డి 2017 అక్టోబరులో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే చంద్రబాబు సలహాతోనే కాంగ్రెస్‌లో చేరారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో అయితే చేరారు కానీ..అక్కడి గ్రూపు రాజకీయాలు తట్టుకుని నిలబడం అంతతేలికైన వ్యవహారం కాదని త్వరగానే తెలుసుకున్నారు.
సొంతపార్టీ నేతలు చీత్కారాలమధ్యే తనపని తాను చేసుకుంటూ వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్‌పై నమ్మకంతో 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ ఇచ్చింది. అయితే 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడ రేవంత్ దూకుడుకు కాస్త బ్రేకు పడినట్లైంది. పార్టీలోనూ ఆయనపై మరింత అసంతృప్త జ్వాల రగలడానికి కారణమైంది. అయినా వెనక్కి తగ్గలేదు. ఏం జరిగినా..ఎలా జరిగినా తన మంచికే అనుకుంటూ ముందుకువెళ్లాడు.
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఈ గెలుపు హైకమాండ్‌కు రేవంత్‌రెడ్డిని మరింత దగ్గర చేసింది. అక్కడ నుంచి రేవంత్‌రెడ్డి దూకుడు కాంగ్రెస్ పార్టీలో మరో లెవల్‌కు వెళ్లింది. ఎదిగేలా చేసింది. అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శథవిధాలుగా ప్రయత్నించారు. ఆయన పట్టుదల, పార్టీని ముందుకు నడిపించింది. రేవంత్ చూపించిన శ్రద్ద నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజుల్లో ఎన్టీ రామారావు పడిన కష్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనం. అందుకే రేవంత్ రెడ్డి పేరును సీఎంగా ప్రకటించడమే ఆలస్యం అటు కాంగ్రెస్‌తో పాటు టీడీపీ నేతల నుంచి కూడా అభినందనలు అందుతున్నాయి.
ఎలాంటి పాలనా అనుభవం లేకుండానే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా సుభిక్ష పాలన అందించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా టీడీపీని మలచడంతో ఎన్టీఆర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. సినిమాలో మాదిరే ఎన్ని ఎత్తులు, జిత్తులు వేస్తూ.. తనుకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. పార్టీ పెట్టినపుడు సినిమాలు తీసేవాళ్లు రాజకీయాలు చేస్తారా అంటూ అవహేళన చేశారు. అందరి నోళ్లకు తాళం వేస్తూ ఏపీ అసెంబ్లీ 6వ విడత ఎన్నికల్లో 204 సీట్లు సాధించారు. ఇప్పడు దాన్నే అందిపుచ్చుకున్న రేవంత్ రెడ్డి అనుహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రెఢి అవుతున్నారు.
అందరూ ఊహించినట్లుగానే రేవంత్ రెడ్డి రాజకీయ పరంగా మరో ఎన్టీఆర్‌గా తనకంటూ ఒక ఇమేజ్‌ను ఆవిష్కరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన పార్టీని ఓడించారు. అంతర్గత కుమ్ములాటలతో చతికిలాపడుతున్న పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారు. తనకు సాటి మరేవరు లేరని..తనతో పోటీకి వచ్చే వాళ్లు లేరని నిరూపించుకొని ఎన్టీఆర్ హిస్టరీని మరోసారి రిపీట్ చేశారు రేవంత్ రెడ్డి.
రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డినే సీఎల్పీ నేతగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఆయన డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ సీఎల్పీగా ఎన్నికవడం ఆయన అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఎట్టకేలకు రేవంత్‌ని సీఎంగా చూడాలన్న ఆయన అభిమానుల కల నెరవేరింది. పార్టీ నుంచి ప్రకటన రాగానే సంబరాలు మొదలుపెట్టేశారు రేవంత్ అభిమానులు. కోడంగల్‌లోని ఆయన స్వగృహం దగ్గర టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…