CM KCR Cabinet : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని మంత్రి మండలి ఈ నెల 30 సమావేశం కాబోతోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానున్న ఈ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, పంటలు, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాల మీద క్యాబినెట్ చర్చించనున్నది. కాగా, రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలువల మరమ్మత్తులు, వాటి పరిస్థితి, తదితర సాగు నీటి అంశాలపై నిన్న ప్రగతి భవన్లో సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కృష్ణాబేసిన్ లో ప్రభుత్వం ఇటీవల నిర్మించ తలపెట్టిన లిఫ్టులు, గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతిని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని ఎత్తిపోతల పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
“వేల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నాం. వాటిని వ్యూహాత్మకంగా రైతు సంక్షేమానికి వినియోగించే విధానాలను అవలంబించాలె. ప్రాణహితలో నీటి లభ్యతను అది ప్రవహించేతీరును అర్థం చేసుకోవాలి. ప్రాణహిత ప్రవాహం జూన్ 20 తర్వాత ఉధృతంగా మారుతుంది. అప్పడు వచ్చిన నీరును వచ్చినట్టే ఎత్తిపోసి కాళేశ్వరం రాడార్లో వున్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపాలి. మిగిలి ఉన్న కొద్దిపాటి కాల్వల మరమ్మత్తుల కొరవలను సత్వరమే పూర్తి చేసుకొని, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టాలి. కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి”. అని కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.