Telangana: ‘తల్లిమాటలే స్ఫూర్తి..’ లండన్‌ ISR లీడర్‌షిప్ సదస్సులో తెలంగాణ వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు..

|

Oct 19, 2024 | 3:44 PM

మట్టిలో మాణిక్యం ఆయన. చిన్నతనంలో తనను చదివించడానికి తల్లి పడిన కష్టాలు చూసిన ఆయన పెద్దయ్యాక పెద్ద వ్యాపారవేత్తగా మారాడు. కానీ తనను ప్రయోజకుడిని చేసిన ఈ సమాజానికి తాను తిరిగి ఇవ్వాలనే తల్లిమాటలను ఆయన మర్చిపోలేదు. చదువు ఉంటే మంచి భవిష్యత్తు వస్తుందని గట్టిగా నమ్మిన ఆయన పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన సేవలకుగానూ తాజాగా అరుదైన అవార్డు కూడా దక్కింది. ఆయన ఎవరంటే..

Telangana: తల్లిమాటలే స్ఫూర్తి.. లండన్‌ ISR లీడర్‌షిప్ సదస్సులో తెలంగాణ వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు..
Siddu Reddy Kandakatla
Follow us on

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిద్దు రెడ్డి కందకట్లను ISR (ఇండివిడ్యువల్ సోషియల్ రెస్పాన్స్‌బిలిటీ) లీడర్ అవార్డు దక్కించుకున్నారు. లండన్‌లోని వెస్ట్మినిస్టర్ చాపెల్‌లో జరిగిన ISR లీడర్‌షిప్ సదస్సులో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆయనకు ప్రదానం చేశారు. సిద్దు రెడ్డి ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయినప్పటికీ, ఆయన సోదరి ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా సిద్దు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఈ ISR లీడర్ అవార్డు నాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇది ప్రభుత్వ పాఠశాలల్లోనూ, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి పెడుతోంది. ఈ విజయం నాకు మాత్రమే కాక, ఈ విద్యా లక్ష్యాన్ని నమ్మి, నాకు మద్దతు తెలిపిన అందరికీ చెందినది’ అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

అమ్మ మాటలే సేవకు ప్రేరణ

సిద్దు రెడ్డి సామాజిక సేవ 2014లో ప్రారంభమైంది. ఆయనను ఈ దిశలో నడిపించిన వ్యక్తి ఆయన తల్లి కందకట్ల బుచ్చమ్మ. సిద్దు విద్య కోసం కష్టపడి కూరగాయలు అమ్మిన బుచ్చమ్మను చూసిన సిద్దు.. సమాజానికి తిరిగి ఇవ్వాలని గట్టిగా సంకల్పించుకున్నారు. ఆయన శంషాబాద్‌లోని సిద్ధాంతి బస్తీలో ఓ ప్రభుత్వ పాఠశాల దయనీయమైన స్థితిలో ఉండటం గమనించారు. ఆ స్థితిని చూసిన సిద్దు పాఠశాల పునర్నిర్మాణం చేసేందుకు ముందుకొచ్చారు.

రాయన్నగూడా కాచారం గ్రామంలోని సదరు ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించేందుకు 2020లో నడుం బిగించారు. విద్యార్థుల అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరచడానికి మొత్తం రెండు ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించేందుకు ఆయన ముందుకొచ్చారు. శంషాబాద్ ఆర్జునవాడలో ఓ పాఠశాలకు భవనం నిర్మించి, ఆ ప్రాంతంలో ఇంగ్లీష్ మాధ్యమ విద్యను ప్రవేశపెట్టాడు. 2024 ఫిబ్రవరిలో న‌టుడు సోను సూద్ ప్రారంభించిన ఈ కొత్త సదుపాయాలు 200 కంటే ఎక్కువ విద్యార్థులకు లాభం చేకూర్చాయి. విద్యా ప్రాప్యత, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. సమాజానికి తిరిగి ఇవ్వడం ప్రాధాన్యతను ఆయనకు చెప్పిన తన తల్లి వల్ల సిద్ధూలో విద్య పట్ల అభిమారం మరింత పెంపొందింది.

ఇవి కూడా చదవండి

కస్తూర్బా గాంధీ పాఠశాల ఏర్పాటు

సిద్దు రెడ్డి మహిళా విద్యకు ప్రాధాన్యం ఇస్తూ పామాకుల్ గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించే ఈ పాఠశాలో 500 మంది బాలికలకు విద్య అందిస్తుంది. ‘విద్య అనేది మంచి భవిష్యత్తుకు పునాది. ఈ పాఠశాల ద్వారా పామాకుల్ పరిసర గ్రామాల బాలికలకు విద్యా వనరులు అందుబాటులోకి వస్తాయని’ సిద్దు తెలిపారు. సిద్దు రెడ్డి విద్యా సేవలతోపాటు అంగవైకల్యం ఉన్న వ్యక్తులకు 10కి పైగా యాక్టీవా స్కూటీలు అందించారు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాలకు అనేక ఆటో రిక్షాలు విరాళంగా ఇచ్చారు కూడా. వీటివల్ల వారికి జీవనాధారం పొందడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. సిద్ధూరెడ్డి సామాజిక సేవ ద్వారా పేదరికంలో ఉన్న వారిని ఉద్ధరించాలని, వారి జీవన ప్రమాణాలలో స్పష్టమైన మార్పులు తీసుకురావాలనే సంకల్పం ప్రతిబింబిస్తుంది. విద్యా కార్యక్రమాలతోపాటు నటుడు సోనూ సూద్‌తో కలిసి ఆరోగ్య, వైపరీత్య సహాయ కార్యక్రమాల్లోనూ సిద్దు రెడ్డి పాల్గొంటున్నారు. వీరి సేవలు కిందిస్థాయి ప్రజల జీవితాలలో కీలక మార్పులు తీసుకొచ్చాయి.

ISR అవార్డు అందుకున్న సందర్భంగా సిద్దు తన భావాలను పంచుకుంటూ.. ‘ఈ అవార్డు నాకు సేవాభావాన్ని మరింతగా పెంపొందించడానికి ఉత్సాహాన్నిస్తుంది. ప్రతి చిన్న చర్య సమాజంలో పెద్ద మార్పుకు దారితీస్తుంది’ అని సంతోషం వ్యక్తం చేశారు. సిద్దు రెడ్డి కందకట్ల సామాజిక బాధ్యతతో పనిచేసే ఒక నాయకుడిగా నిలిచారు. ‘కస్తూర్బా గాంధీ పాఠశాల’ ప్రారంభంతో, నిరుపేద విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఆయన కల సాకారమవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.