బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై స్వంత పార్టీలోనే అసమ్మతి రగులుతోంది. సంజయ్‌పై పార్టీ సీనియర్ నేత కన్నం అంజయ్య సంచలన కామెంట్స్ చేశారు. దళితులపై సంజయ్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. దళితులకు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశం కోసం ధర్మం కోసం కష్టపడుతున్న కార్యకర్తలను మెచ్చుకోవడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు.
కోరు కమిటీలో దళితులకు పదవులు ఇవ్వడంపై చర్చించడాన్ని గుర్తు చేసిన అంజయ్య.. బీసీ నాయకుడిగా ఉండి, దళితులకు పదవులు ఇవ్వకుండా ఉండటమేంటని నిలదీశారు. భారతీయ జనతా పార్టీలో మా స్థానం ఏంటని కార్యకర్తలు అడుగుతున్నారని, ఏమని చెప్పాలని ప్రశ్నించారు. ఆర్థికంగా సపోర్ట్ చేసేవాళ్లకే బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళని బండి సంజయ్ పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. నిన్న మొన్న వచ్చిన వారు జాతీయ నాయకులవుతారని, ఏళ్లుగా పార్టీ కోసం సేవలు అందించిన వారు అలాగే ఉండిపోతున్నారని వ్యాఖ్యానించారు అంజయ్య. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు చనిపోతే వాళ్లింటికి వెళ్లి ఓదార్చలేని అధ్యక్షుడివి ఇంకేం భరోసా ఇస్తావు? అంటూ బండి సంజయ్‌పై సంచలన కామెంట్స్ చేశారు అంజయ్య.
కరీంనగర్‌లో వ్యతిరేక ఆత్మీయ సమ్మేళనం పెడతామని ప్రకటించారు బీజేపీ నేత అంజయ్య. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ఎంతమంది దళితులకు పదవులు ఇచ్చావో తెలుసుకుందాం అంటూ సవాల్ విసిరారాయన. ఏ జిల్లాకు దళితున్ని జిల్లా అధ్యక్షులు చేయలేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేయమన్నందుకు బండి సంజయ్ తనపై కక్ష పెంచుకున్నాడని అంజయ్య ఆరోపించారు.
ఇదే సమయంలో మాజీ ఎంపీ వివేక్‌పైనా షాకింగ్ ఆరోపణలు చేశారు. తాము కట్టిన జెండాలకు కలర్లు వేసి జెండాలు ఎగరేస్తాడు మాజీ ఎంపీ వివేక్ అంటూ విమర్శించారు. దళితుల మధ్యలో విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జాతీయ కార్యవర్గ సభ్యునిగా చేస్తే దళితులకు అన్యాయం చేస్తున్నాడని వివేక్ తీరుపై ఫైర్ అయ్యారు అంజయ్య.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..