Husnabad Meeting – Bandi Sanjay: 36 రోజులు.. 438 కిలోమీటర్లు.. 8 జిల్లాలు.. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 6 పార్లమెంట్ నియోజకవర్గాలు.. 35 సభలు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సాగిన తీరు ఇది. ఆగస్ట్ 28న చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర యాత్ర… సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఇవాళ ముగియనుంది.
ఆగస్ట్ 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తొలి అడుగు వేసిన బండి సంజయ్.. కాలినడక 438 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. 36రోజుల పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నారు. జనం బాధలు విన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలతోనూ మాట్లాడారు. బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
తొలి దశ ప్రజా సంగ్రామ యాత్రలో 8 జిల్లాలు, 19 అసెంబ్లీ అండ్ 6 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించారు.
బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. ప్రతిచోటా ఘనస్వాగతం లభించింది. బోనాలు, మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. అన్ని వర్గాలను కలుస్తూ అందరి సమస్యలు వింటూ, వారికి భరోసా కల్పిస్తూ బండి సంజయ్ పాదయాత్ర సాగింది.
బండి సంజయ్ తొలి దశ పాదయాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాంతో, హుస్నాబాద్ పట్టణమంతా కాషాయమయంగా మారింది. దాదాపు లక్షమందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ఆరుగురు కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, 24మంది జాతీయ నేతలు హాజరుకానున్నారు.
తొలి దశ పాదయాత్రను విజయవంతంగా ముగించబోతున్న బండి సంజయ్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేసి అభినందించారు. క్యా బండీ.. కైసో హో.. అచ్చా కియా.. వైసీ హీ ఆగే చలో.. అంటూ ఎంకరేజ్ చేశారు. మంచి పని చేశావ్.. అలాగే ముందుకెళ్లు అంటూ అభినందించారు. ఇక, నేటి హుస్నాబాద్ మహాసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని సెంటరాఫ్ అట్రాక్షన్ కానున్నారు.