Bathukamma Sarees: బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం.. చీరల డిజైన్, రంగులపై ఆసక్తికర అంశాలు!

|

Sep 30, 2021 | 7:35 PM

Telangana Bathukamma Sarees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Bathukamma Sarees: బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం.. చీరల డిజైన్, రంగులపై ఆసక్తికర అంశాలు!
Bathukamma Sarees
Follow us on

Bathukamma Sarees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు చీరల జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బ‌తుక‌మ్మ పండుగను ప్రతి ఒక్క ఆడ‌బిడ్డలు తార‌త‌మ్య బేధం లేకుండా సంబురంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చీరల పంపిణిని చేపట్టింది. ఈ క్రమంలో అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు గ్రామ, వార్డు కమిటీలతో పాటు స్వయం సహాయక సంఘాలతో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గతేడాది పంపిణీ సందర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించిన అధికారులు.. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఈ సారి 30 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగులతో సుంద‌రంగా తీర్చిదిద్దారు. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా కొత్త రకాలు, కొత్త డిజైన్లుతో చీరలు తయారయ్యాయని అధికారులు తెలిపారు. జాకార్డు,డాబి బార్డర్ చీరలను తయారు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 810 ర‌కాల చీర‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.చీరల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పోరేషన్ డివిజన్ల వారీగా రేషన్‌ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండగా.. ఈ ఏడాది రూ.318 కోట్లను వెచ్చించింది. దాదాపు 16 వేల మగ్గాలపై పది వేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేశాయి.

ఈ సంవత్సరం చీర‌ల‌న్ని జ‌రి అంచుల‌తో త‌యారు చేయ‌బ‌డి, 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్, నూలుతో త‌యారు చేయించింది. అలాగే, ఈ ఏడాది 6 గజాలు, 9 గజాల చీరలను తయారు చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మహిళలు 9 గజాల చీరలు ధరిస్తారు. దీంతో వారికి అనుగుణంగా 9 గజాల చీరలను తయారు చేశామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా క‌లెక్టర్లు ఎంపిక చేయ‌బ‌డిన గోదాముల‌కు బ‌తుక‌మ్మ చీర‌లను తరలించారు అధికారులు. గ్రామ‌, వార్డు స్థాయి క‌మిటీల ద్వారా అక్టోబ‌ర్ 2 నుంచి గ్రామాల్లో చీర‌ల పంపిణీ చేయనున్నారు.

2017లో 95, 48,439 మంది మ‌హిళ‌ల‌కు, 2018 లో 96,70,474 మందికి, 2019 లో 96,57,813 మందికి, 2020 లో 96,24,384 మంది మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేశారు. ఈ ఏడాది కోటి మందికి పైగానే చీర‌ల‌ను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. అక్టోబర్ 2వ తేదీ నుండి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లా మరమగ్గాల మీద మాత్రమే బతుకమ్మ చీరలను తయారీ చేయించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 90 శాతం చీరల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు చేరుకున్నాయన్నారు.

Read Also… Pawan Kalyan Vs YSRCP Leaders: సమాధానం చెబితే మాపై దాడులు చేయిస్తారా? పవన్‌పై శ్రీకాంత్ రెడ్డి ధ్వజం