కాంగ్రెస్‌లో తొలి జాబితా చిచ్చు.. గాంధీ భవన్‌కు తాకిన సామాజికవర్గాల్లో అసమ్మతి సెగలు

Telangana Election: అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీకీ పలు నియోజకవర్గాల్లో నిరసన ఎదురైంది. టికెట్‌ ఆశించి భంగపడిన కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి, పీసీసీ అధ్యక్షుడిపై ఆరోపణలు చేయగా.. మరికొందరు గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోందని అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు.

కాంగ్రెస్‌లో తొలి జాబితా చిచ్చు.. గాంధీ భవన్‌కు తాకిన సామాజికవర్గాల్లో అసమ్మతి సెగలు
Telangana Congress Clashes

Updated on: Oct 16, 2023 | 3:16 PM

అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీకీ పలు నియోజకవర్గాల్లో నిరసన ఎదురైంది. టికెట్‌ ఆశించి భంగపడిన కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి, పీసీసీ అధ్యక్షుడిపై ఆరోపణలు చేయగా.. మరికొందరు గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు.

కాంగ్రెస్‌ తొలి జాబితా ఆ పార్టీలో అగ్గి రాజేసింది. వివిధ సామాజికవర్గాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడ్డాయి. గాంధీ భవన్‌లో మేడ్చల్ నియోజకవర్గ నేతలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ బచావ్ అంటూ హరివర్ధన్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. మేడ్చల్ సర్వేల రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. హరివర్దన్ రెడ్డి మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అమలు చేయాలని కార్యకర్తలు కోరారు. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాలో మేడ్చల్ టికెట్‌ను తోటకూర వజ్రేష్ యాదవ్‌కు కేటాయించారు.

మరోవైపు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోందని టీపీసీసీ కార్యదర్శి డాక్టర్‌ కురువ విజయ్‌ కుమార్‌ ఆరోపించారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆయన తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ , ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి లిస్ట్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇక ఉప్పల్‌లో రాగిడి లక్ష్మారెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు..టీపీసీసీ చీఫ్ నియంతలా వ్యవహరిస్తున్నారని..సెల్యూట్ కొట్టేవారికి టికెట్లు ఇస్తున్నారన్నారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మొండిచెయ్యి చూపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పేంటో ఉప్పల్ చౌరస్తాలో నిరూపిస్తారా అంటూ సవాల్ చేశారు రాగిడి లక్ష్మారెడ్డి. మరోవైపు కొల్లాపూర్ టిక్కెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ జూపల్లి కృష్ణారావుకు కేటాయించింది. దీంతో చింతలపల్లి జగదీశ్వర్ రావు ఆఫీస్‌లోని పార్టీ ఫ్లెక్సీలను అనుచరులు చించేశారు. అయితే ఇలా టికెట్లు ప్రకటించారో లేదో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది.

ఇక పొత్తులో భాగంగా CPIకి కొత్తగూడెం ఇవ్వొద్దని.. కాంగ్రెస్‌ పార్టీనే పోటీ చేయాలని కాంగ్రెస్‌ నేతలు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిచే టిక్కెట్లను పొత్తులో భాగంగా CPIకి గానీ, CPIM కి గానీ ఇవ్వొద్దని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. సగం కంటే తక్కువ స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తేనే ఈ స్థాయిలో రచ్చ జరిగితే ఇక మొత్తం స్థానాలకు అభ్యర్థుల జాబి తా విడుదలైతే పరిస్థితి ఇంకెలా ఉండేదోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..